సాగు భూమిలో సారం క్రమంగా తగ్గిపోతోంది. లాభాల కోసం వ్యాపారులు అంటగట్టే రసాయన ఎరువులతో ఇప్పటికే చేవ కోల్పోతున్న చేను.. అవగాహన లేమి కారణంగా కొందరు రైతులు చేస్తున్న తప్పిదాలతో మరింత ప్రమాదంలో పడుతోంది. దీని కారణంగా మరోవైపు పంటలకు మేలు చేసే మిత్రపురుగులు కూడా మరణిస్తున్నాయి. దీంతో క్షారం పూర్తిగా తగ్గిపోయే ప్రమాదమూ లేకపోలేదు. అందుకే పంట చేలలోని వ్యర్థాలను ఎప్పుడూ కాల్చవద్దని, ఎండిన వ్యర్థాలను పొలంలోనే కలియదున్నాలని వ్యవసాయ శాఖ నిపుణులు సూచిస్తున్నారు.
కూసుమంచి, మే 15 : ఇప్పటికే విచ్చలవిడిగా వినియోగిస్తున్న రసాయన ఎరువులతో సాగు భూమి రోజురోజుకూ తన సారాన్ని కోల్పోతోంది. ఈ తరుణంలో రైతులు తమ పంటల వ్యర్థాలను చేలలోనే కాల్చుతుండడంతో మరింత ప్రమాద ఏర్పడుతోంది. పంటలకు మేలు చేసే పురుగులు భూమిలోనే నివసిస్తుంటాయి. సాగు సమయంలో అవి మేల్కొని విత్తనాలను, వేర్లను ఆశించే క్రిమికీటకాలను సంహరించి ఆరగిస్తుంటాయి. ఇలా పంటలకు ఎంతో మేలు చేకూరుస్తాయి. కానీ.. సహజంగానే వేసవిలో రైతులు పంటల వ్యర్థాలను చేనులో ఒక చోట చేర్చి కాల్చివేస్తుంటారు. కొన్ని పంటలనైతే ఎక్కడివి అక్కడే ఉంచి నిప్పు అంటిస్తుంటారు. దీంతో ఆ మంటలు చేను అంతటా విస్తరించడంతో సాగు భూమిలోని అన్నిచోట్లా ఉన్న మిత్ర పురుగులు చనిపోతున్నాయి. దీంతో తదుపరి సాగు సమయంలో క్రిమికీటకాలు, తెగుళ్లు ఎక్కువై పంటల దిగుబడి గణనీయంగా తగ్గిపోతోంది. దీంతో రైతులు ఎంతగా శ్రమించినప్పటికీ ఆర్థికంగా నష్టపోతున్నారు.
పంటల దిగుబడి పెరగాలన్నా.. చీడపీడలు ఆశించకుండా ఉండాలన్నా ముఖ్యంగా సాగుభూమి సారవంతమైనదై ఉండాలి. బలమైన ఖనిజ లవణాలు, పంటలకు మేలుచేసే మిత్ర పురుగులు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. అందుకోసం పంటలు అయిపోయిన తరువాత వ్యర్థాలను తొలగించుకోవాలి తప్ప కాల్చకూడదు. వేసవిలో తొలగించడం సాధ్యం కాకపోతే తొలకరి రోజుల్లో భూమి తడిసిన తరువాత వ్యర్థాలను పూర్తిగా తీసివేయాలి. లేకుంటే నీళ్లు పెట్టి కుళ్లిన తరువాత భూమిలో కలియదున్నాలి. మరీ ముఖ్యంగా వేసవిలో పశువులు పెంటను చేనులో తోలాలి. పచ్చి రొట్టను పెంచాలి. గొర్రెలు, మేకలు వంటి జీవాలను పొలంలో ఎక్కువ రోజులు ఉంచాలి. వాటి పెంట భూమికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే, వేప కషాయాలు, గోమూత్రాలు, పంచామృతాలు వంటివి కూడా వినియోగించాలి. దీంతో భూసారం మరింతగా వృద్ధి చెందుతుంది. దిగుబడులు గణనీయంగా పెరుగుతాయి.
అవగాహన లేమి, తక్కువ శ్రమ వంటి కారణాల వల్ల కొందరు రైతులు తమ చేలల్లోని పంట వ్యర్థాలకు నిప్పు పెడుతున్నారు. దీంతో పంటలకు మేలు చేసే మిత్రపురుగులు సాగు భూమిలోనే చనిపోతున్నాయి. ఫలితంగా దిగుబడులు తగ్గిపోతాయి. అయితే దిగుబడులను కృత్రిమంగా పెంచడం కోసం చాలామంది రైతులు రసాయన ఎరువులను అధిక మోతాదులో వినియోగిస్తున్నారు. ఇది సాగు భూమికి మరింత నష్టం చేకూరుస్తుంది. అందుకని చేలలోని పంట వ్యర్థాలకు రైతులెవరూ నిప్పు పెట్టొద్దు. సేంద్రియ ఎరువులను విరివిగా వినియోగించాలి. ఇలాంటి పద్ధతులతో భూసారాన్ని పెంచుకుంటేనే అధిక దిగుబడులు వస్తాయి.