వానొస్తే ఉప్పొంగే వాగులు. రోజులతరబడి వాగుల వద్ద జాగారాలు. ఇటు నుంచి అటు రావాలన్నా.. అటు నుంచి ఇటు వెళ్లాలన్నా ఆ ఆదివాసీ బిడ్డల తిప్పలు. ప్రాణాపాయమొస్తే బతుకుపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితులు. దశాబ్దాలు గడిచినా పట్టించుకోని పాలకులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి సమస్యకు పరిష్కారం లభించింది. ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ వాగుపై బ్రిడ్జి, రోడ్డు విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో నిధులు మంజూరు చేశారు. నిర్మాణాలు పూర్తి కావడంతో నడిచేందుకు రాచబాట ఏర్పడింది. వాగుపై వారధి వచ్చింది. దీంతో ఇప్పలచెలక గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు.
టేకులపల్లి, ఆగస్టు 9:ఆ ఊరు.. ఆదివాసీల గూడెం. పెద్దగా లోకం తెలియని గిరిజనుల గ్రామం. అక్కడి ఆదివాసీలకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. అదే.. టేకులపల్లి మండలం ఇప్పలచెలక గ్రామం. అక్కడి ప్రజల జీవనం సుమారు ఏడు దశాబ్దాలుగా ప్రాణ సంకటంగా మారింది. అక్కడి తెల్ల వాగే దానికి కారణమైంది. వర్షాకాలంలో అది ఉప్పొంగితే వరద తగ్గే వరకూ రాకపోకలు అంతరాయమే. అదే సమయంలో ఎవరైనా అనారోగ్యం పాలైనా, ఏ గర్భిణికైనా పురిటి నొప్పులు వచ్చినా ప్రాణసంకటమే. ఇన్నేళ్లలో ఏ పాలకుడూ ఆ ఆదివాసీల సమస్యపై కన్నెత్తిచూడలేదు. కానీ తెలంగాణ సిద్ధించి కేసీఆర్ సీఎం అయ్యాక ఆ సమస్యకు పరిష్కారం లభించింది. ఆ మార్గంలో రహదారిని, ఆ వాగుపై వంతెనను నిర్మించడంతో ఆదివాసీల కష్టాలు తొలగిపోయాయి. దీంతో వారిలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.
73 ఏళ్ల సమస్యకు పరిష్కారం..
టేకులపల్లి మండలం మారుమూల గిరిజన ప్రాంతం కొప్పురాయి. ఆ గ్రామ పంచాయతీలోని ఒడ్డుగూడెం నుంచి 1.20 కిలోమీటర్ల దూరంలో 1950లో తెల్లవాగు ఒడ్డున 20 కుటుంబాల ఆదివాసీలు ఓ గుంపును (గ్రామాన్ని) నిర్మించుకున్నారు. అయితే వాగు పొంగిన ప్రతిసారీ ఇళ్లు కొట్టుకుపోతుండడంతో 10 తర్వాత కాస్త ఎత్తయిన ప్రాంతానికి వెళ్లి నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. దానిపేరే ఇప్పలచెలక గ్రామం. ఇక్కడ 35 ఇళ్లు, 80 ఓట్లు ఉన్నాయి. వారు ఎత్తయిన ప్రాంతానికి వెళ్లినా అక్కడ వారికి మరో సమస్య ఎదురైంది. అదీ తెల్లవాగే. ఈ గ్రామ ప్రజలు నిత్యం మండల కేంద్రానికి వెళ్లి నిత్యావసర సరుకులు, వ్యవసాయ పనిమిట్లు తెచ్చుకుంటుంటారు. కానీ వర్షాకాలంలో ఈ తెల్లవాగు పొంగితే మాత్రం వారి తిప్పలు మామూలుగా ఉండేవి కావు. వరద తగ్గే వరకూ ఎన్ని రోజులు గడిచినా ఎదురుచూపులే తప్పేవి కావు. అదే సమయంలో గ్రామంలో ఎవరైనా, అనారోగ్యం పాలైనా, గర్భిణులకు పురిటి నొప్పులు వచ్చినా నరకయాతనే ఉండేది. తెలంగాణ సిద్ధించాక ఈ సమస్యను గమనించిన ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన రహదారి, వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ప్రస్తుతం వాటి నిర్మాణాలు పూర్తికావడంతో ఇప్పలచెలక గ్రామ ఆదివాసీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాగు పొంగినా అంతరాయం లేకుండా రాకపోకలు సాగిస్తున్నారు.
రెండు నెలల్లో నిర్మాణాలు..
ఈ సమస్య పరిష్కారం కోసం ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ ఐటీడీఏ నుంచి రూ.93 లక్షల నిధులు నిధులు మంజూరు చేయించారు. రూ.28 లక్షలతో రెండు నెలల్లోనే ఒక వెట్ కల్వర్టు, మూడు పైపు కల్వర్టులను పూర్తి చేయించారు. అలాగే రూ.93 లక్షలతో 1.20 కిలోమీటర్ల రోడ్డు నిర్మించారు. మరో రూ.50 లక్షలతో గ్రామాభివృద్ధి, పనులు, రహదారి అభివృద్ధి పనులు చేపట్టారు. దీంతో ఇన్నాళ్లూ ఆదివాసీలు ఎదుర్కొన్న సమస్యకు పూర్తి స్థాయి పరిష్కారం లభించింది.
సీఎం కేసీఆర్‌కు, ఎమ్మెల్యే హరిప్రియకు ధన్యవాదాలు..
మా గ్రామానికి బ్రిడ్జి లేక ఇన్నాళ్లూ అనేక ఇబ్బందులు పడ్డాం. మా గ్రామానికి ఎవరైనా రావాలంటే చాలా ఇబ్బంది పడేవారు. సరైన దారికపోకపోవడం, వాగు దాటాల్సి రావడం వంటి కారణాలతో ఇక్కడి పిల్లలతో వివాహ సంబంధాలు కలుపుకోవడానికి కూడా ఎవరూ ముందుకు వచ్చే వారు కాదు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే హరిప్రియ సహకారంతో మా సమస్య తొలగిపోయింది. రోడ్డు, బ్రిడ్జి నిర్మించిన సీఎం కేసీఆర్‌కు, ఎమ్మెల్యే హరిప్రియకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
-పూన్నెం లక్ష్మి, ఇప్పలచెలక
ఎన్నో ఏళ్ల ఇబ్బందులు తొలగించారు..
మా ఊరి వాగు వరద వల్ల కలిగే ఇబ్బందులను నా చిన్న నాటి నుంచీ చూస్తూనే ఉన్నాను. మా ఊరికి రోడ్డు ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూసేదాన్ని. ప్రతి సారీ ఎన్నికలప్పుడు నాయకులు వచ్చేవారు. రోడ్డు, బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పి వెళ్లేవారు. కానీ తరువాత ఎవరూ రాలేదు. రోడ్డు, బ్రిడ్జీ నిర్మించనూ లేదు. కానీ ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ మాత్రం ఇచ్చిన మాట ప్రకారం తక్కువ కాలంలోనే రోడ్డు, వంతెన నిర్మించారు. ఎన్నో ఏళ్ల ఇబ్బందులు తొలగించారు.
-పాయం లక్ష్మీకాంత, ఇప్పలచెలక
గ్రామ ప్రజలందరూ బీఆర్ఎస్ వైపే ఉంటామంటున్నారు..
ఇప్పలచెలక గ్రామస్తుల చిరకాల కోరికను తీర్చిన సీఎం కేసీఆర్‌కు ఆ గ్రామ ప్రజలందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. దశాబ్దాల ఇబ్బందులను తొలగించినందుకు కృతజ్ఞతగా వారంతా బీఆర్ఎస్ వెంటే ఉంటామని చెబుతున్నారు. నేను సర్పంచ్‌గా ఉన్న సమయంలో అనేక అభివృద్ధి పనులు జరగడం, రహదారి, వంతెన నిర్మాణం కావడం సంతోషంగా ఉంది.
– చింత మంగమ్మ, సర్పంచ్, కొప్పురాయి
ఇప్పలచెలక ప్రజలు సంతోషిస్తున్నారు..
తెల్లవాగుపై వంతెనను, గ్రామానికి రహదారిని నిర్మించడంతో ఇప్పలచెలక గ్రామ ప్రజలు ఎంతగానో సంతోషిస్తున్నారు. గత ప్రభుత్వాలు మాటలు మాత్రమే చెప్పేవని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం బ్రిడ్జి, రోడ్డు నిర్మించి తమ ఇబ్బందులను తొలగించిందని వారు చెబుతున్నారు. దశాబ్దాల కష్టాలు తొలగిపోవడంతో వారి కళ్లలో ఆనందం కన్పిస్తోంది. ఇక ఎంత పెద్ద వర్షమొచ్చినా, ఎన్ని వరదలొచ్చినా ఆ గ్రామ ప్రజలు నిశ్చింతగా ఉంటారు.
-హరిప్రియ, ఇల్లెందు ఎమ్మెల్యే