మధిర, ఆగస్టు 11 : చింతకాని మండలంలోని నాగలవంచ రైల్వే స్టేషన్ మూసివేత నిర్ణయాన్ని రైల్వే అధికారులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైల్వే స్టేషన్ వద్ద ఆ ప్రాంతవాసులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మధిర నియోజకవర్గం స్వేరోస్ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ మాట్లాడుతూ.. 77 ఏళ్ల చరిత్ర కలిగిన నాగులవంచ రైల్వే స్టేషన్ సుమారు 15 గ్రామాలు ప్రజలు ఈ స్టేషన్ పైన ఆధారపడి ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. నాగులవంచ, పాతర్లపాడు, పొద్దుటూరు, రామాపురం, సీతంపేట, చిన్న మండవ, గోవిందపురం, లక్ష్మీపురం ఇలా అనేక గ్రామాల ప్రజలు కొన్నేండ్ల క్రితం రోడ్డు మార్గం కూడా సరిగ్గా లేని సమయంలో నాగులవంచ రైల్వే స్టేషన్ పైనే ఆధారపడి ప్రయాణించేవారన్నారు. ఈ గ్రామాల నుండి విద్యార్థులు కాలేజీలకు వెళ్లడానికి రైలు పైనే ఆధారపడేవారన్నారు.
విజయవాడ, భద్రాచలం, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లేందుకు ఈ స్టేషన్ చాలా ఉపయుక్తం అన్నారు. ఈ ప్రాంతాల నుండి ఉపాధి కోసం కూలీలు రైల్లో ప్రయాణించి జీవనోపాధి పొందేవారని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ స్టేషన్ మరమ్మతుల నిమిత్తం అని చెప్పి స్టేషన్లో టికెట్లు ఇవ్వపోవడంతో ఈ స్టేషన్లో ఎక్కిన ప్రయాణికులు మధిర, ఖమ్మం స్టేషన్ లో టికెట్ చెకింగ్ లో ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ స్టేషన్ నుంచి టికెట్ లేకుండా ఎవరూ కూడా రైలు ఎక్కడానికి ముందుకు రావడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాతర్లపాడు మాజీ సర్పంచ్ శ్రీనివాస్, రైల్వే కాలనీ మాజీ సర్పంచ్ పరిటాల ఎల్లమంద, చింతకాని మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు కోపూరు నవీన్ పాల్గొన్నారు.