మామిళ్లగూడెం, ఆగస్టు 10: గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బడుగుల ఓట్ల కోసం జపాలు చేసిన కాంగ్రెస్ సర్కారు.. తీరా గెలిచాక వారి సంక్షేమానికి తూట్లు పొడుస్తోంది. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం, వినియోగం కోసం గత ప్రభుత్వం ఖమ్మం జిల్లా కేంద్రంలో చేపట్టిన సామాజిక భవనాల నిర్మాణాలపై శీతకన్ను వేసింది.
ఆయా నిర్మాణాలను పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చే ఆలోచనను పూర్తిగా విస్మరించింది. గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలను ముట్టుకోవడానికి కూడా ఇష్టపడని ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం.. అంతిమంగా ఆయా భవనాలను సంబంధిత వర్గాలకు దూరం చేస్తోంది. ఈ భవనాల నిర్మాణాలను కనీసంగా కూడా పట్టించుకోకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పట్ల ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిలోపం స్పష్టమవుతోంది.
ఇప్పటికే సింహభాగం పూర్తయిన ఈ భవనాల నిర్మాణాలను మరికొన్ని నిధులతో పూర్తి చేసి ఆయావర్గాల ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న నిబద్ధత.. జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులకూ లోపించింది. మైనార్టీ భవనం పునాదుల్లోనే ఉన్నా; బీసీ భవనం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారినా, ప్రైవేటు వాహనాలను పార్కింగ్ స్థలంగా రూపాంతరం చెందినా; పిల్లల్లు, భీమ్‌లు, గోడలు శిథిలావస్థకు చేరి అంబేద్కర్ భవన్ కూలేందుకు సిద్ధంగా ఉన్నా ప్రస్తుత ప్రభుత్వానికి పట్టింపులేకపోయింది.
తమ సంక్షేమ భవనాల నిర్మాణంపై కాంగ్రెస్ సర్కారు చూస్తుండడంతోనే బడుగులంటే ఆ ప్రభుత్వానికి అలుసని అర్థమవుతోందని బడుగు, బలహీన, గిరిజన, మైనార్టీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక, అధికార పార్టీ నేతలు, ఆ పాలకులు అందించే తాయిలాలకు అలవాటు పడిన ఆయా ప్రజా సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు ఈ భవనాల నిర్మాణంపై నోరుమెదపడం లేదు. ప్రభుత్వంపై పోరాడి ఆయా భవనాలను తమ వర్గాల ప్రజలకు అందుబాటులోకి తేవడంలో విఫలమవుతున్నారు.
శిథిలావస్థలో అంబేద్కర్ భవన్..
1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అప్పటి ప్రభుత్వం ఖమ్మంలో నిర్మించిన అంబేద్కర్ భవన్ ప్రసుత్తం శిథిలావస్థకు చేరింది. పిల్లర్లు శిథిలమై వాటిల్లోని ఇనుప చువ్వలు బయటికి కన్పిస్తున్నాయి. భీమ్‌లు కూడా దెబ్బతిన్నాయి. గోడలకు పగళ్లు ఏర్పడ్డాయి. నాణ్యతను కోల్పోయిన ఆ భవనం ప్రసుత్తం కూలే స్థితిలో ఉంది. దీంతో ఆ భవనంలో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఓ గదిలో సహాయ సంక్షేమాధికారి కార్యాలయం కొనసాగుతోంది.
అయితే, ఈ భవనాన్ని పూర్తిగా తొలగించి నూతన భవనం నిర్మించాలని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరిట ఇందులో గ్రంథాలయాన్ని ఏర్పాటుచేయాలని, నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలకు అవసరమయ్యేలా శిక్షణ ఇచ్చే ఎస్సీ స్టడీ సర్కిల్‌ను ఏర్పాటుచేయాలని ఆయా వర్గాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ భవనం పరిస్థితిని తెలియజేస్తూ కలెక్టర్ అనుమతితో ఈడబ్ల్యూఐడీసీ ఈఈకి ఇటీవల ప్రతిపాదనలు పంపించినట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ డీడీ కస్తాల సత్యనారాయణ తెలిపారు.
ప్రైవేటు వాహనాల పార్కింగ్ అడ్డాగా బీసీ భవనం
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2 కోట్ల వ్యయంతో చేపట్టిన బీసీ సామాజిక భవనం నిర్మాణ పనులను కూడా ప్రస్తుత ప్రభుత్వం పూర్తిచేయడం లేదు. బీసీ వర్గాలకు సామాజిక భవనం అవసరాన్ని గుర్తించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఖమ్మంలోని బైపాస్ రోడ్డులో బీసీ భవన నిర్మాణాన్ని చేపట్టింది. నిర్మాణ పనులు పూర్తయ్యే దశకు చేరుకున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మిగతా పనులను మూలనపడేసింది.
అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా దాని పనులు చేపడుతున్న గుత్తేదారు తమ వర్గం వాడు కాదని భావించిన కొందరు అధికార పార్టీ నేతలు.. ఉద్దేశపూర్వకంగానే ఈ పనులను నిలిపివేసినట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రులు కూడా పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం ఆ భవనం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు వాహనాల పార్కింగ్ భవనంగానూ మారింది. ఈ విషయంపై ఆ భవన నిర్మాణ పనులు పర్యవేక్షణ చేస్తున్న పీఆర్ ఈఈ మహేశ్‌బాబును సంప్రదించగా.. మిగిలిన పనులకు అంచనాలను రూపొందించి మరోసారి టెండర్లు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాధానమిచ్చారు.
అసంపూర్తిగా గిరిజన భవనం
ఖమ్మంలోని ఉన్న గిరిజన భవనంపై మరో అంతస్తు నిర్మించి గిరిజనులకు అందుబాటులోకి తెచ్చేందుకు గత ప్రభుత్వం సంకల్పించింది. రూ.కోటి ఎస్డీఎఫ్ నిధులతో మరో అంతస్తును కూడా స్లాబ్ లెవెల్ వరకూ నిర్మించింది. దానిని కూడా పూర్తిచేసే సమయానికి అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. తరువాత ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ ప్రభుత్వం ఆ పనులను పూర్తిచేసేందుకు ముందగుడు వేయలేదు. దీంతో అది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నా ప్రస్తుత ప్రభుత్వంలో చలనం కన్పించడం లేదు. ఈ విషయంపై గిరిజన సంక్షేమ శాఖ ఏఈ విజయ్‌ని వివరణ కోరగా.. నిధుల కోసం గుత్తేదారు పనులు నిలిపి వేశారని సమాధానమిచ్చారు. నిధులు వచ్చాకే పనులు ప్రారంభిస్తామంటున్నట్లు చెప్పారు.
పునాది దశలోనే షాదీఖానా..
ఖమ్మం నగరంతోపాటు జిల్లాలోని మైనార్టీ ప్రజల వేడుకలు, ఇతర వివాహాలు, శుభకార్యాలకు వినియోగించుకునేందుకు ఖమ్మంలోని సీక్వెల్ పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో గత ప్రభుత్వం రూ.2 కోట్ల కేఎంసీ ఎల్ఆర్ఎస్ నిధులతో షాదిఖానా నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. పిల్లర్ల నిర్మాణ పనులను మొదలైన సమయంలో రాష్ట్రంలో అధికార బదిలీ జరిగింది. ఆ తరువాత పాలనా పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పునాదులను అలాగే ఉంచింది. ఆ షాదీఖానా నిర్మాణానికి నేటికీ అడుగులు వేయలేదు.