భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ కొద్ది రోజులకే జూనియర్ కళాశాలల్లోని గెస్ట్ లెక్చరర్లకు రెస్ట్ ఇచ్చింది. ఉన్న పళంగా విధుల్లోంచి తొలగించడంతో బాధిత అతిథి అధ్యాపకుల కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంత దుస్థితినీ కల్పించిన రేవంత్ ప్రభుత్వం.. తొలగించిన అతిథి అధ్యాపకులకు నాలుగు నెలలుగా, కొనసాగిస్తున్న అతిథి అధ్యాపకులకు 8 నెలలుగా వేతనాలూ చెల్లించడం లేదు. వారి కుటుంబాలు ఆకలితో అలమటించేలా చేస్తోంది. ఒక నెల వేతనం ఆలస్యమైతేనే కుటుంబ పరిస్థితి తలకిందులయ్యే ఈ రోజుల్లో దాదాపు ఎనిమిది నెలలుగా వేతనాలు ఇవ్వకుండా వారి కుటుంబాలను పస్తులుంచుతోంది. పిల్లల చదువులు, ఆరోగ్య సమస్యలు, కుటుంబం గడిచేందుకు ఇంట్లోకి కిరాణా సరుకులు తదితర ఖర్చులకు చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో అతిథి అధ్యాపకులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు అన్నీఇన్నీ కావంటే అతిశయోక్తి కాదు.
నెలల తరబడి వేతనాల పెండింగ్
ఒక్కో అతిథి అధ్యాపకుడికి నెలకు రూ.28,080 చొప్పున ప్రభుత్వం వేతనం చెల్లిస్తోంది. కొనసాగుతున్న వారిలో 27 మంది గెస్ట్ లెక్చరర్లకు నెలకు 7,58,160 చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన వీరికి ఎనిమిది నెలలకు గాను రూ.60,65,280 చెల్లించాల్సి ఉంది. అలాగే, గత విద్యాసంవత్సరంలో తొలగించిన 22 మందికి నెలకు 6,17,760 చొప్పున నాలుగు నెలలకు రూ.24,71,040 చెల్లించాల్సి ఉంది. 27 మందికి రూ.60,65,280, 22 మందికి 24,71,040 కలిపి 85,36,320 వేతనాలను ప్రభుత్వం పెండింగ్ పెట్టింది. దీంతో ప్రతి నెలా వేతనం రాకపోవడంతో కుటుంబాలను వెళ్లదీసుకునేందుకు అతిథి అధ్యాపకులు అష్టకష్టాలు పడుతున్నారు.
‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ సామెతలాగా..
‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ సామెతలాగా ఉంది జూనియర్ కళాశాలల్లోని గెస్ట్ లెక్చరర్ల పరిస్థితి. పేరుకు మాత్రం లెక్చరర్ హోదా. వేతనం అంతంత మాత్రం. శ్రమ మాత్రం అత్యధికం. కళాశాలల్లోని రెగ్యులర్ లెక్చరర్ల కంటే ఎక్కువగా పనిచేస్తుంటారు. ప్రభుత్వం అప్పగించిన విధుల మేరకు ఉదయం నుంచి సాయంత్రం వరకూ తమ సబ్జెక్టులేగాక ఒకేషనల్ కోర్సుల సబ్జెక్టులనూ బోధిస్తుంటారు. కానీ, వీరికి వేతనాలు మాత్రం ప్రతి నెలా అందే పరిస్థితే లేదు. దీంతో అప్పులు తెచ్చుకొని కుటుంబాన్ని వెళ్లదీసుకోవాల్సిన దయనీయ స్థితి.
ఈ గెస్ట్ లెక్చరర్ పేరు నర్సింగ్ లింగయ్య. నివాసం.. రామవరం దగ్గర గరీబ్‌పేట. ఉద్యోగం చేసేది కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో. ఇతడికి గత విద్యాసంవ్సతరంలో నాలుగు నెలల వేతనం, ఈ విద్యాసంవత్సరంలో మరో నాలుగు నెలల వేతనం ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ఇంత వరకూ ఇతడి వేతనం ఊసే ఎత్తకపోవడంతో ఆర్థికంగా సతమతమవుతున్నాడు. పిల్లల చదువులు, కుటుంబ పోషణ వంటి వాటి కోసం ఇప్పటి వరకూ రూ.2 లక్షలు అప్పు చేశాడు. ఎనిమిది నెలలు గడిచినా ప్రభుత్వం వేతనం ఇవ్వకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. కిరాణా సరుకుల కోసం దుకాణం వద్ద అప్పు పెట్టిన వాళ్లు, పిల్లల ఫీజు కోసం చేబదులు ఇచ్చిన వాళ్లు తమ నగదు అడుగుతుండడంతో ఎటూ పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
‘రెగ్యులర్’లు వస్తే ‘గెస్ట్’లు ఇంటికే..
అతిథి అధ్యాపకులుగా వచ్చాం. అలాగనే ఇంటికి వెళ్లాల్సి వస్తోంది. పర్మినెంట్ అధ్యాపకులు వస్తే మమ్మల్ని ఇంటికి పంపిస్తారు. నాలాంటి గెస్ట్ లెక్చరర్లు భద్రాద్రి జిల్లాలో 20 మందికి పైగా ఉన్నారు. నౌకరీ లేక నిరుటి నుంచి ఖాళీగా ఉంటున్నాం. నౌకరీ లేని కారణంగా ఊళ్లోని కిరాణా దుకాణంలో కూరగాయలు కూడా అప్పు ఇవ్వడం లేదు.
-రంజిత్‌కుమార్, అతిథి అధ్యాపకుడు, టేకులపల్లి
బడ్జెట్ రాలేదు.. అందుకే పెండింగ్..
గెస్ట్ లెక్చరర్లకు వేతనాలు ఇచ్చేందుకు బడ్జెట్ రాలేదు. రాగానే వారి వేతనాలు చెల్లిస్తాం. జిల్లాలో 14 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 49 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. రెగ్యులర్ లెక్చరర్లు వచ్చాక 22 మందిని విధుల నుంచి తొలగించాం. 27 మంది కొనసాగుతున్నారు. ఒకవేళ ఖాళీలు ఉంటే.. తొలగించిన వారిని మళ్లీ తీసుకునే అవకాశం ఉంటుంది.
-హెచ్.వెంకటేశ్వరరావు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి, భద్రాద్రి