భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఏజెన్సీ పిల్లల్లో పోషకాహార లోపాన్ని పారద్రోలుతామని గొప్పలు చెప్పుకుంటూ కేంద్రం నీతిఆయోగ్‌లో భాగంగా ప్రవేశపెట్టిన ఆకాంక్ష (యాస్పిరేషన్) ప్రోగ్రాం మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. కేంద్రం ఎంపిక చేసిన యాస్పిరేషన్ జిల్లాలతో పాటు భద్రాద్రి జిల్లా చిన్నారులకూ మొండిచేయే ఎదురైంది. మారుమూల ఏజెన్సీలో కొండరెడ్లు, ఆదివాసీల పిల్లల ఆరోగ్యంపై తాము ప్రత్యేక శ్రద్ధ చూపుతామమని, వారికి మిల్లెట్ ఫుడ్ అందిస్తామని కేంద్ర సర్కారు గొప్పలు చెప్పుకొని ఇప్పుడు చేతులెత్తేసింది. పట్టుమని ఏడాదైనా అమలు చేయకుండా కేవలం తొమ్మిది నెలలకే పథకాన్ని అటకెక్కించింది. పథకం ఆగిపోయి ఇప్పటికీ కొన్ని నెలలు కావొస్తున్నది.
కేంద్రం పంపిన మిల్లెట్ ఫుడ్డూ లేదు..
రక్తహీనత తక్కువగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో చిన్నారులకు, గర్భిణులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా మిల్లెట్ ఫుడ్ అందించాలని కేంద్రం భావించింది. ఇందుకోసం పాల్వంచ, దమ్మపేట ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ముందుగా 100 కేంద్రాలను ఎంపిక చేసింది. 2021 నుంచి పోషకాహారం అందించడాన్ని ప్రారంభించింది. ఆహారంలో ప్రధానంగా రాగి, జొన్న వంటివి ఉండేలా మెనూ అమలు చేసింది. తర్వాత ఆరు నెలలకు ప్రోగ్రాం అటకెక్కింది. 2022లో మళ్లీ ఇదే కార్యక్రమం మళ్లీ షురూ అయింది. ఈసారి కేంద్రం జిల్లాలోని మరో ఆరు ప్రాజెక్టులను అదనంగా ఎంపిక చేసి ప్రోగ్రాన్ని ప్రారంభించింది. తర్వాత మూడు నెలలే ప్రోగ్రాం అమలైంది. తర్వాత గతంలో లాగానే అటకెక్కింది. దీంతో ప్రోగ్రాం కేంద్రం ప్రచార ఆర్భాటం కోసమేననే విషయం తేలిపోయింది.
కేంద్ర ప్రభుత్వం మిల్లెట్ ఫుడ్‌ను నిలిపివేయడంతో గత కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన ‘ఆరోగ్యలక్ష్మి’ పథకమే గర్భిణులు, బాలింతలు, పిల్లలను ఆదుకున్నది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు పాలు, గుడ్లు, ఆరోగ్యలక్ష్మి భోజనం, బాలామృతం, కిశోరామృతం వంటివి అందాయి. జిల్లాలో 8 నెలల నుంచి ఏడాది వయసున్న చిన్నారులు 8,549 మంది, 1 – 3 వయసున్న పిల్లలు 24,466 మంది, 3 – 6 ఏళ్ల లోపు వయసున్న పిల్లలు 26,749 మంది, గర్భిణులు 8,060, బాలింతలు 6,927 మంది ఉన్నారు. వీరందికీ బీఆర్ఎస్ ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం అందించింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఇటీవల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఆ ప్రభుత్వం గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఎలాంటి సేవలను ఎంత సమర్థతతో అందిస్తుందో వేచిచూడాల్సిందే.
ఏజెన్సీలో బలంగా లేని పిల్లలకు కేంద్రం నుంచి అంగన్వాడీ సెంటర్ల ద్వారా కొన్ని నెలలపాటు మిల్లెట్ ఆహారం అందింది. ఆ తర్వాత పథకం ఆగిపోయింది. తర్వాత ఇక్కడి ప్రభుత్వం అం పోషకాహారమే తీసుకుంటున్నాం. ఆరోగ్యలక్ష్మి భోజనంతోపాటు పాలు, గుడ్ల వంటి బలవర్ధకమైన ఆహారం అందిస్తున్నారు. మొదటి తొమ్మిది నెలలపాటు క్రమం తప్పకుండా అందించే పోషకాహారమే తల్లీబిడ్డలకు ఎంతో ఉపయోగం.
అంగన్వాడీ కేంద్రాలను మాకు పోషకాహారం అందుతున్నది. గర్భిణులతో పాటు తల్లీబిడ్డలకు ఆరోగ్యపరంగా సూచనలు అందుతున్నాయి. మాకు గుర్తు ఉన్నా లేకున్నా అంగన్వాడీలు, ఆశ కార్యకర్తలు వచ్చి మా పిల్లలకు టీకాలు వేస్తున్నారు. తల్లులకు బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పిల్లలకు అందే మిల్లెట్ ఫుడ్ ఇప్పుడు అందడం లేదు.