మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే కూలీల వేతనాలు చెల్లించకుండా వారిని మూడునెలలుగా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2.02 లక్షల మందికిపైగా ఉపాధి కూలీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధి పనులు చేసిన కూలీలకు రూ.3.50 కోట్లకు పైగా బకాయిలను కేంద్రం చెల్లించాల్సి ఉంది. కనీస సౌకర్యాలు కల్పించకపోయినా మండుటెండలో పనులు చేస్తున్న ఉపాధి కూలీల పట్ల బీజేపీ ప్రభుత్వం కనీస కనికరం చూపటం లేదు. రోజువారీ పనులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న నిరుపేద కూలీలు వేతనాలు అందక అల్లాడిపోతున్నారు. కుటుంబం మొత్తం కడుపు నింపుకోలేక పస్తులు ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది.
– అశ్వారావుపేట, ఏప్రిల్ 25
భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 22 మండలాల్లోని 481 గ్రామ పంచాయతీల్లో 1.23 లక్షల జాబ్‌కార్డులు ఉండగా 2.02 లక్షల మంది ఉపాధి పనులకు హాజరవుతున్నారు. ఇతర ప్రాంతాలకు కూలీల వలసలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. గ్రామాల్లోనే కూలీలకు ఉపాధి కల్పించి ఆర్థిక భరోసానివ్వటం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పథకం లక్ష్యాన్ని నీరుగార్చేలా అనేక కుట్రలు చేస్తున్నది.
ఈ దశలోనే కూలీలకు వేతనాలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నది. దీంతో రోజూ కూలీపైనే ఆధారపడిన కార్మికులు వేతనాలు అందక పస్తులు ఉంటున్నారు. ఈ ఏడాది జనవరి 15వ తేదీ నుంచి కూలీల వేతన బకాయిలు చెల్లించకుండా తాత్సారం చేస్తుంది. ప్రస్తుతం వ్యవసాయ పనులు కూడా లేకపోవడంతో ఉపాధి పనులపైనే కూలీలు ఆధారపడ్డారు. ప్రతి ఇంటి నుంచి ఒక్కరైనా పనులకు హాజరవుతున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కూలీల సహనాన్ని కేంద్ర ప్రభుత్వం పరీక్షిస్తున్నది. చేసిన కష్టాన్ని గుర్తించి సకాలంలో కూలి చెల్లించకుండా వారి బతుకులకు కనీస భరోసానివ్వకుండా ఛిద్రం చేస్తున్నది.
కొర్రీలతో నిర్వీర్యం
నిరుపేద కూలీల బతుకులకు భరోసానిచ్చే జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అనేక కొర్రీలతో నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నదని ప్రజా సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వాటా 10శాతం నుంచి ఏకంగా 40 శాతానికి పెంచిన కేంద్రం ఆర్థిక భరాన్ని తగ్గించుకుంది. అలాగే పని ప్రదేశాల్లో కనీస సదుపాయాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తూ ఖర్చులను కూడా తగ్గించుకుంది. కూలీలకు తాగునీటితో పాటు వసతి(నీడ), ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలి. అవేవీ కంటికి కనిపించటం లేదు. దీంతోపాటు ఈకేవైసీ పేరుతో కూలీల సంఖ్యను తగ్గించుకునేలా ప్రయత్నిస్తుంది.
ఉపాధి చట్టం ప్రకారం చేసిన పనికి వేతనం 15 రోజుల్లోగా చెల్లించకుంటే పరిహారం అందించాలి. ఆ ఊసే తీయకుండా కూలీలను ఇబ్బందులకు గురిచేస్తున్నది. దీనివల్ల ఉపాధి పనులకు వెళ్లేందుకు కూలీలు ఆసక్తి చూపటం లేదు. జిల్లాకు ఈ ఏడాది జనవరి 15వ తేదీ నుంచి కూలీలకు వేతనాలు చెల్లించకుండా సుమారు రూ.3.50 కోట్లకు పైగా బకాయిపడినట్లు అంచనా. కూలీలను ఇబ్బందులకు గురిచేసి ఉపాధి పథకం నుంచి వేరే పనులకు మళ్లించే కుట్ర చేస్తుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కూలీల సంక్షేమం దృష్ట్యా బృహత్తర ఆలోచనతో అమలు చేస్తున్న ఉపాధి పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు.
వందరోజుల పని పూర్తి చేశాను..
ఉపాధిహామీ పథకంలో వంద రోజుల పని పూర్తి చేశాను. జనవరి 15వ తేదీ నుంచి ఇంతవరకు ఉపాధి వేతనం అందలేదు. మా కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నది. ఎప్పుడు కూలీ డబ్బు జమ అవుతుందోనని బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాను.
– కుంజా భూలక్ష్మి, ఉపాధి కూలీ, మద్దికొండ
పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర
కూలీలకు ఉపాధి కల్పించే గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. ఇందులో భాగంగానే దశల వారీగా నిధులు తగ్గించటంతోపాటు పనుల సంఖ్యను కుదిస్తున్నది. పని ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కూడా కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. కూలీలకు చేసిన పనికి వేతనం చెల్లించకపోవటం కూడా బీజేపీ కుట్రలో భాగమే. బకాయిలు వెంటనే చెల్లించకుంటే ఆందోళన చేపడతాం.
– పిట్టల అర్జున్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు, అశ్వారావుపేట
ఉపాధి పనులే ఆధారం
ఉపాధి పనులే మా కుటుంబానికి జీవనాధారం. చేసిన పనులకు నెలల తరబడి డబ్బులు అందటం లేదు. పని ప్రదేశాల్లో కనీస వసతులు లేకున్నా బతుకుదెరువు కోసం ఎండలోనే పనిచేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే కూలీ బకాయిలు చెల్లించాలి.
– మెండి పెంటమ్మ, ఉపాధి కూలీ, భీమునిగూడెం
త్వరలోనే బకాయిలు చెల్లింపు
ఉపాధిహామీ కూలీలకు పెండింగ్ బకాయిలు త్వరలోనే చెల్లింపులు జరుగుతాయి. ఈ మేరకు ప్రభుత్వం నిధులు విడుదల చేయనుంది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం వీబీ జీరాంజీగా మార్చటం వల్ల కొంత ఆలస్యమవుతోంది. దీంతోపాటు కూలీలందరూ ఈకేవైసీ పూర్తి చేసుకోలేదు. అందరి కూలీల వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నాం. ఉపాధి పనిచేసిన కూలీలకు ఆందోళన అవసరం లేదు.
– రామచంద్రరావు, ఈజీఎస్ ఏపీవో, అశ్వారావుపేట