ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నది. కూలీల పొట్టగొట్టేందుకు సరికొత్త ఎన్ఎంఎంఎస్ (నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం) సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చింది. రోజుకు రెండు పూటలా పని ప్రదేశంలో ఫొటో దిగడం, మస్టర్ నిబంధన అమలు చేయడం వంటివి కూలీలను కలవరపెడుతున్నాయి. రోజుకు రెండు పూటలా పని చేస్తున్న ఫొటోలను మేట్ ఎన్ఎంఎంఎస్ సాఫ్ట్‌వేర్‌లో అప్లోడ్ చేయాలి. అలా చేస్తేనే పూర్తి హాజరుతో కూలి వస్తుందని అధికారులు చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్ ఉన్నవారినే మేట్లుగా నియమిస్తున్నారు. వీరు ఫోన్లో ఎన్ఎంఎంఎస్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని ఎప్పటికప్పుడు పని వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. దీనికి రకరకాల సమస్యలు తలెత్తుతుండడంతో ఉపాధి కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ తీరుపై మండిపడుతున్నారు.
– సత్తుపల్లి, జనవరి 4
సత్తుపల్లి, జనవరి 4 : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఎంఎంఎస్(నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం) సాఫ్ట్‌వేర్‌తో కూలీలకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. రోజుకు రెండు సార్లు పని ప్రదేశంలో ఫొటో దిగడం, మస్టర్ నిబంధన కూలీలను కలవరపెడుతున్నది. ప్రతి పేద కుటుంబానికి ఏడాదిలో 100 రోజులు పని కల్పించాలనే లక్ష్యంతో 2005లో అప్పటి ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టింది. గతంలో రాష్ట్రానికి చెందిన సాఫ్ట్‌వేర్‌లో ఉపాధి హామీ పనుల వివరాలను నమోదు చేసేవారు.
గతేడాది మేలో ఎన్‌ఎంఎంఎస్‌ను ప్రయోగాత్మకంగా చేపట్టి 2003 జనవరి 1 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయాలని రాష్ర్టాలకు ఆదేశాలు ఇచ్చింది. ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలు ఉదయం ఆరు గంటలకు పనులకు వెళ్లి కొలతల ప్రకారం పనులు చేసి 10 గంటల కల్లా ఇళ్లకు చేరుకుంటారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నూతన సాఫ్ట్వేర్ ద్వారా ఉదయం 6 నుంచి 11గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పని చేయాలి. అందుకు సంబంధించిన రెండు ఫొటోలను పని సమయంలోనే సంబంధిత గ్రూప్‌కు చెందిన మేట్ ఎన్ఎంఎంఎస్ ద్వారా సాఫ్ట్‌వేర్‌లో ఆప్‌లోడ్ చేయాలి. అలా చేస్తేనే పూర్తి హాజరుతో కూలీ వస్తుందని అధికారులు చెపుతున్నారు. స్మార్ట్‌ఫోన్ ఉన్నవారినే మేట్లుగా నియమిస్తున్నారు. వీరు ఫోన్లో ఎన్ఎంఎంఎస్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని ఎప్పటికప్పుడు పని వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
సాధ్యమయ్యేనా…
రెండు పూటలా పని విధానం అమలు కష్టంగా మారనున్నది. ఫిబ్రవరి నుంచే ఎండలు మండుతూ 40 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రెండు పూటలా పని చేయడంపై కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పల్లెల్లో ఉపాధి పనులకు వెళ్లడానికి ప్రయాణ సౌకర్యం లేకపోగా ఎంత దూరమైనా నడుచుకుంటూఎండలోనే వెళ్లాలి. అలాంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానంతో ఉదయం, సాయంత్రం పనులు కష్టమేనని కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి కూలీ ముఖం ఫొటోలో స్పష్టంగా కనిపిస్తేనే ఆన్లైన్లో హాజరు నమోదయ్యే అవకాశం ఉంటుంది. దీనికితోడు పని ప్రదేశంలో మొబైల్ సిగ్నల్ వేధిస్తున్నది. పని ప్రదేశం నుంచి ఫొటోలు ఆప్‌లోడు చేయడం సరికాదని కూలీలంటున్నారు.
కొత్త విధానం ప్రకారం…
రోజుకు రెండుసార్లు హాజరు…
కూలీల హాజరును రోజుకు రెండుసార్లు నమోదు చేయాల్సి ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో పని ప్రదేశంలో ఫొటోలను తీసి యాప్‌లో అప్లోడ్ చేయాలి. దీనితో పనులకు హాజరైన కూలీల వివరాలు స్పష్టంగా తెలుస్తాయి. జనవరి 1 తేదీ నుంచి ఈ ప్రక్రియను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు. జిల్లాలో 1,39, 060 జాబ్‌కార్డులకు గాను 2,25,349 మంది కూలీలు ఈజీఎస్ పనులకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నూతన విధానంతో కూలీలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నది. అవినీతి, అక్రమాలను అరికట్టేందుకే కేంద్ర ప్రభుత్వం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చినా కూలీలకు మాత్రం ఇబ్బందులు తప్పవు.
సిగ్నల్స్ లేకపోతే ఇబ్బందులు..
ఉపాధి హామీ పనులు గ్రామీణ ప్రాంతాల్లోని పల్లెల్లో ఊరికి దూరంగా చెరువులు, పొలాల్లో చేపట్టాల్సి వస్తున్నది. దీంతో ఆయా ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్స్ లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కూలీల హాజరు నమోదులో తీవ్ర ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కూలీలు కోరుతున్నారు.
ఎన్ఎంఎంఎస్తో ఇబ్బందులు
ఎన్ఎంఎంఎస్ విధానం ద్వారా కూలీలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుంది. పని ప్రదేశంలో రెండుసార్లు హాజరు నమోదు కష్టతరం. వేసవిలో ఉదయం, సాయంత్రం పని చేయలేం. పాత పద్ధతిని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం వందరోజుల పని దినాలు కల్పించి మెరుగైన వేతనం కల్పించాలి.
– పర్సా సుబ్బయ్య, ఉపాధి కూలీ, తాళ్ళపెంట, పెనుబల్లి మండలం
‘ఉపాధి’ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి కూలీల పొట్ట కొట్టేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. కూలీలకు ఎన్ఎంఎంఎస్ మస్టర్ పేరుతో రెండు పూటలా మస్టర్ వేయడం, రెండుసార్లు ఫొటోలు తీసుకోవాలని తీసుకొచ్చిన చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. రెండుపూటలా మస్టర్ విధానం కూలీలకు ఇబ్బంది. ఇప్పటికే కూలీల కనీస వేతసం అందడం లేదు. ఉపాధి హామీని కూలీలకు దూరం చేసేందుకే మోదీ కుట్ర. ఇప్పటికైనా ఎన్‌ఎంఎంఎస్‌ను ఉపసంహరించుకోవాలి.
– దండు ఆదినారాయణ, వ్యవసాయ కార్మికసంఘం, బీకేఎంయూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్
పాత విధానాన్నే అమలు చేయాలి
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఎంఎంఎస్ విధానం ద్వారా కూలీలు నష్టపోయే అవకాశం ఉంది. వేసవికాలంలో ఉదయం, సాయంత్రం పని చేయాలంటే కష్టతరం. కేంద్ర ప్రభుత్వం ఈ విధానంపై పునరాలోచించి పాత పద్ధతినే కొనసాగించి, ఈజీఎస్ కూలీలకు వందరోజుల పని కల్పించాలి.
– పానెగుండ్ల మాధవరావు, ఉపాధి కూలీ, తాళ్ళపెంట, పెనుబల్లి మండలం