నామినేషన్ల ఘట్టం ముగియడంతో ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం జోరందుకున్నది. శనివారం ఊరూరా.. వాడవాడలా ప్రచారానికి వెళ్లిన అభ్యర్థులకు స్వాగతం పలుకుతున్న ప్రజలు.. ఇంటింటికీ అభ్యర్థితో కలిసి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. అభ్యర్థుల కుటుంబ సభ్యులు సైతం ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలో పొందుపరిచిన అంశాలపై ఒక్కొక్కటిగా అవగాహన కల్పిస్తున్నారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వివరిస్తున్నారు. గత పాలనకు.. ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధికి బేరీజు వేసుకోవాలని, బీఆర్ఎస్ను మళ్లీ ఆశీర్వదిస్తే నిరంతరాయ అభివృద్ధి కొనసాగుతుందని చెబుతున్నారు.