వ్యవసాయాన్ని నమ్ముకొని ఆరుగాలం కష్టించే రైతులు. పగలనక రేయనక పంట పొలాలు, చేల వద్దకు పరుగులు. సాగుపై ఉన్న మమకారంతో తమకు ఎటు నుంచి ఏ ప్రమాదం పొంచి ఉందనేది గుర్తించకుండానే సాగు పనుల్లో లీనమయ్యే రైతులు. పాములు, తేళ్లు, విద్యుత్ షాక్, రోడ్డు ప్రమాదాలు ఇలా.. అనుకోని ఘటనల్లో రైతులు ప్రాణాలు కోల్పోవడం. ఇంటి పెద్ద దిక్కు లేని ఆ కుటుంబం పరిస్థితి వర్ణనాతీతం. చదువుకుంటున్న చిన్న పిల్లలు, పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు.. వారి పరిస్థితి ఏమిటి? ఆ కుటుంబానికి అండ.. ఆసరాగా నిలిచేదెవరు? మేమున్నామంటూ.. రైతు సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సీఎం కేసీఆర్.. ప్రమాదవశాత్తు రైతు మృతిచెందితే ఆ కుటుంబం రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో 2018, ఆగస్టు 15 నుంచి ‘రైతుబీమా’ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఒక్కో రైతుకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించడంతోపాటు ప్రభుత్వమే ప్రీమియం సొమ్ము చెల్లిస్తోంది. రైతు ఏ కారణంతో మృతిచెందినా సరే మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందుతున్నది. జిల్లాలో ఐదేళ్ల కాలంలో 4,198 రైతు కుటుంబాలకు రూ.209.90 కోట్ల బీమా సొమ్మును అందజేసింది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతుబీమాతో కొండంత అండగా నిలిచినందుకు బాధిత రైతు కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
మధిర, నవంబర్ 6 : రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ప్రతి సీజన్ అదునులో రాయితీపై విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారు. పంటలకు 24 గంటలపాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నారు. రైతుబంధులో భాగంగా ఏడాదిలో ఎకరానికి రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ప్రమాదవశాత్తు రైతు మృతిచెందితే ఆ కుటుంబం రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో 2018 ఆగస్టు 15 నుంచి ‘రైతుబీమా’ పథకాన్ని అమలు చేస్తున్నది. ఒక్కో రైతుకు రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నది. ఈ మేరకు ‘లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ)’కు ప్రీమియం చెల్లిస్తున్నది. రైతు ఏ కారణంతో మృతిచెందినా సరే మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందుతున్నది. జిల్లాలో ఐదేళ్ల కాలంలో 4,198 రైతు కుటుంబాలకు రూ.209.90 కోట్ల బీమా సొమ్మును అందజేసింది. పథకం ఐదేళ్ల నుంచి అమలవుతుండగా.. ఆగస్టు 16 నుంచి ఆరో సంవత్సరంలోకి అడుగు పెట్టింది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతుబీమాతో కొండంత అండగా నిలిచినందుకు రైతు కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
రైతుబీమా పథకంతో జిల్లాలోని రైతులు ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు. దీంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై రైతులు, వారి కుటుంబాలకు మరింతగా విశ్వసం పెరిగింది. ఐదేళ్లలో జిల్లాలో 2018లో రైతులు 813 మంది మృతిచెందగా.. రూ.40.65 కోట్లు వారి కుటుంబ సభ్యుల ఖాతాల్లో జమ చేశారు. 2019లో 840 మందికి రూ.42.00 కోటు, 2020లో 1,209 మందికి రూ.60.45కోట్లు, 2021లో 895 మందికి రూ.44.75 కోట్లు, 2022లో 441 మందికి రూ.22.05 కోట్లు.. జిల్లాలో మొత్తం 4,198 మంది రైతు కుటుంబాలకు రూ.209.90 కోట్లను అందించారు. మధిర నియోజకవర్గంలోని మధిర, బోనకల్లు, చింతకాని, ముదిగొండ, ఎర్రుపాలెం మండలంలోని 979 రైతు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.48.95 కోట్లు బాధిత రైతు కుటుంబాలకు బీమా సొమ్ము చెల్లించింది.
వాస్తవానికి సాధారణ పౌరుడు బీమా పాలసీ తీసుకోవాలంటే ఎన్నో నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. ఒక వ్యక్తి రూ.5 లక్షల బీమా తీసుకోవాలంటే ముందుగా వైద్య పరీక్షలు తప్పనిసరి. వయస్సు పెరిగిన కొద్దీ ప్రీమియం పెరుగుతుంది. బీమా తీసుకోవడానికి ముందే ఆ వ్యక్తికి వ్యాధులు ఉంటే ప్రీమియం మరింత ఎక్కువవుతుంది. కొన్ని వ్యాధులకైతే వెయిటింగ్ పీరియడ్(వేచి ఉండే సమయం) ఉంటుంది. వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉంటే బీమా కంపెనీలు అసలు బీమానే ఇవ్వవు. ఇక ఆత్మహత్యలు, ఉద్దేశపూర్యకంగా ఘర్షణల్లో పాల్గొని మృతిచెందిన వారికి, హత్యకు గురైన వారికి బీమా అందే అవకాశమే లేదు. ఏ క్షణంలోనైనా మృతిచెందే అవకాశం ఉన్న పోలీసులు, జవాన్లు, రాజకీయ నాయకులకూ బీమా సంస్థలు బీమా ఇచ్చేవి కావు. కానీ.. తెలంగాణ ప్రభుత్వం బీమా సంస్థతో చర్చలు జరిపి రైతు కారణంతో మృతిచెందినా మృతుడి కటుంబానికి రూ.5 లక్షల చొప్పున బీమా పరిహారం ఇవ్వాలని ఒప్పందం చేసుకుని పథకాన్ని అమలు చేస్తున్నది.
తక్కువ వయసులో ఉన్నప్పుడు, వ్యాధులు అంతగా లేనప్పుడు తీసుకునే బీమా పాలసీలకు (రిస్క్ తొందరగా ఉండదు కాబట్టి) ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ బీమా సంస్థలు ప్రీమియాన్ని పెంచుతూ ఉంటాయి. కానీ.. ‘రైతుబీమా’ సామూహిక బీమా కాబట్టి సాధారణ నిబంధనలు వర్తించడం లేదు. సామూహిక బీమా కాబట్టే అందరికీ ఒకటే ప్రీమియం. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి వ్యక్తికీ హెల్త్ బీమా ఉంటుంది. నిజానికి బీమా వినియోగంలో మన దేశం ఇంకా వెనుకబాటులోనే ఉందనడంలో సందేహం లేదు. 1991-92లో సరళీకృత ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చినందున ఎన్నో బహుళజాతి సంస్థలు దేశంలో పెట్టుబడులు పెట్టాయి. బీమా రంగంలో ఉపాధి అవకాశాలు పెరిగాయి. మల్హోత్రా కమిటీ సిఫార్సుల మేరకు 1999లో ఐఆర్డీఏఐ ఏర్పడింది. తరువాత 2000లో సంస్థకు స్వయం ప్రతిపత్తి వచ్చి రాజ్యాంగ సంస్థగా ఏర్పడింది. అప్పటి నుంచి బీమా రంగం ప్రాచుర్యంలోకి వచ్చింది. గతంలో బీమాకు పట్టణ ప్రాంతాల్లోనే ప్రాధాన్యం ఉండేది. సీఎం కేసీఆర్ మాత్రం రైతుల కోసం పట్టణాల నుంచి మారుమూల గిరిజన గూడేలకు చెందిన రైతులకూ బీమా వర్తింపజేస్తున్నారు.
సాధారణంగా బీమా ప్రీమియాన్ని చెల్లిస్తున్నప్పుడు ఎంతోకొంత రిటర్నులు(తిరిగి పొందడం) ఆశిస్తుంటారు పాలసీదారులు. ఇప్పటి వరకూ చాలామంది చెల్లిస్తున్న బీమా పాలసీల్లో సేవింగ్స్ పాలసీలు, మనీ బ్యాక్ పాలసీలు, చిన్నారుల భవిత కోసం పొదుపు చేసే పాలసీలు, యూలిప్ పాలసీలే అధికం. ఇవి ఎక్కువ మొత్తానికి జీవిత బీమా(మనిషి విలువ అత్యల్ప మొత్తానికి)ను కల్పించినా ఈ పాలసీలన్నింటికీ మెచ్యూరిటీ టైం ఉంటుంది. ఆ టైంలో ఎంతో కొంత రాబడి వస్తుంది. కానీ.. టర్మ్ పాలసీలు భిన్నమైనవి. వీటికి మెచ్యూరిటీ ఉండదు. మెచ్యూరిటీ గడువులోగా రిస్క్ జరిగితేనే పరిహారం అందుతుంది. లేదంటే ప్రీమియం చెల్లింపులు వృథానే. ఒక్క పైసా వెనక్కు రాదు. అందుకే ఇవి చాలా తక్కువ ప్రీమియానికి అత్యధిక అష్యూర్డ్ను అందిస్తాయి. రైతుబీమా కూడా సరిగ్గా ఇదే. రిస్క్ జరిగితే వెంటనే క్లెయిమ్ సెటిల్ అవుతుంది.
మాకు ఎకరం పొలం ఉంది. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే నా భర్త కరోనాతో మృతి చెందాడు. ప్రభుత్వం రైతుబీమా వర్తింపజేయడంతో మా కుటుంబానికి కొండంత భరోసా కల్పించినైట్లెంది. నా భర్త కరోనాతో చనిపోయిన పది రోజుల్లో రైతుబీమా ద్వారా రూ.5 లక్షల సాయం చేసి మా కుటుంబానికి ధీమా కల్పించి పెద్దదిక్కు అయ్యారు. ఇంత సాయం చేసిన సీఎం కేసీఆర్ సార్ను ఎప్పటికీ మరువం.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం నా కుటుంబానికి అండగా నిలిచింది. ఏడాది క్రితమే అనారోగ్యంతో భర్తను పోగొట్టుకున్నాను. ఏ కార్యాలయానికి తిరగకుండానే వారం రోజుల్లో నా అకౌంట్లో రూ.5 లక్షలు జమ అయ్యాయి. ఇద్దరు కూతుళ్లున్న నాకు రైతుబీమా ద్వారా వచ్చిన రూ.5లక్షలతో భర్త ఆస్పత్రి ఖర్చులు, పెద్దకూతురు పెళ్లి ఖర్చులు అన్నీ కలిపి మిగిలిన అప్పు రూ.2 లక్షలు తీర్చేశాను. అలాగే ఆసరా పింఛన్ ద్వారా రూ.2,016 నెలనెలా నా బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్నాయి. ఇంతగా సాయపడుతున్న సీఎం కేసీఆర్ సార్ ఎల్లప్పుడూ సల్లగుండాలే.