ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అకాల వర్షానికి పలుచోట్ల చేతికొచ్చిన పంటలు నేలవాలాయి. ఎక్కువ మంది రైతులు కల్లాల్లోని ధాన్యం, మిర్చి, మక్కలపై పట్టాలు కప్పడంతో నష్టం తప్పింది. కొన్ని చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. మామిడి తోటల్లో కాయలు రాలి కిందపడ్డాయి. గడిచిన 24 గంటల్లో ఖమ్మం జిల్లాలో సగటున 39.3 మి.మీ వర్షపాతం నమోదుకాగా అత్యధికంగా కొణిజర్ల మండలంలో 70 మి.మీ వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా 677 మంది పండిస్తున్న 967 ఎకరాల్లో పంటలు నేలవాలాయి. భద్రాద్రి జిల్లాలో సగటున 21.80 మి.మీ వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా అశ్వారావుపేట మండలంలో 62 మి.మీ నమోదైంది. జిల్లావ్యాప్తంగా 30 మంది రైతులు 80 ఎకరాల్లో సాగు చేస్తున్న పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
– భద్రాద్రి కొత్తగూడెం, మే 1 (నమస్తే తెలంగాణ)/ ఖమ్మం వ్యవసాయం
భద్రాద్రి కొత్తగూడెం, మే 1 (నమస్తే తెలంగాణ)/ ఖమ్మం వ్యవసాయం: యాసంగిలో సాగు చేసిన పంటలన్నీ చేతికొచ్చాయి. ఇక నేడో రేపో కోతలు ప్రారంభిద్దామని రైతులు సిద్ధమవుతున్నారు. వరుణుడు మాత్రం అకారణంగా ప్రకోపించి అకాల వర్షం కురిపించాడు. మక్కలు, వరి పంటలను నీటిపాలు చేశాడు. రైతుల కష్టాన్ని బూడిదపాలు చేశాడు. మార్చి, ఏప్రిల్ నెలల్లో కురిసిన అకాల వర్షానికి పంట నష్టాన్ని మరువక ముందే మరోసారి విజృంభించాడు. ఒకవైపు వ్యవసాయశాఖ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తుండగా, అది పూర్తయ్యే లోపు మళ్లీ వర్షం కురుస్తున్నది. ఇదే తరహాలో ఆదివారం అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు ఉమ్మడి జల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఎక్కువ మంది రైతులు ముందస్తుగా కల్లాల్లోని ధాన్యం, మిర్చి, మక్కలపై పట్టాలు కప్పడంతో నష్టం తప్పింది. కొన్ని చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. మామిడి తోటల్లో కాయలు రాలి కిందపడ్డాయి.
మరో రెండురోజుల పాటు చెదురు మొదురు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో ఖమ్మం జిల్లావ్యాప్తంగా సగటున39.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కొణిజర్ల మండలంలో 70 మి.మీ వర్షపాతం నమోదైంది. మధిర మండలంలో 60.5 మి.మీ, బోనకల్ 60.4మి.మీ, ఎర్రుపాలెం 59.4 మి.మీ, వైరా 49.2 మి.మీ, వేంసూర్ 48.8 మి.మీ, ఖమ్మం అర్బన్ 45.4 మి.మీ, ముదిగొండ 42.4 మి.మీ, ఖమ్మం రూరల్ 42.8 మి.మీ, కూసుమంచి 53.8 మి.మీ, మిగలిన మండలాల్లో 20-30 మి.మీ వర్షపాతం నమోదైంది. భద్రాద్రి జిల్లా సగటు వర్షపాతం 21.80మి.మీ నమోదైంది. అత్యధికంగా అశ్వారాపుపేట మండలంలో 62 మి.మీ వర్షపాతం నమోదైంది. ములకలపల్లి మండలంలో 54 మి.మీ, చండ్రుగొండ 28 మి.మీ, జూలూరుపాడు 24 మి.మీ, టేకులపల్లి 18 మి.మీ, అశ్వాపురం 19 మి.మీ, ఇల్లెందు 16 మి.మీ, ఇతర మండలాల్లో 10 -14 మి.మీ వర్షపాతం నమోదైంది.
పంట నష్టం ఇలా..
ఖమ్మం జిల్లా 677 మంది రైతులు 967 ఎకరాల్లో పండిస్తున్న పంటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా వరి 822 ఎకరాలు, మొక్కజొన్న 145 ఎకరాల్లో దెబ్బతిన్నది. ఎర్రుపాలెం మండలంలో 196 మంది రైతులు 250 ఎకరాలు, ఖమ్మం రూరల్ 148 మంది 246 ఎకరాలు, మధిర 177 మంది 246 ఎకరాలు, తిరుమలయపాలెం 85 మంది 111 ఎకరాలు, కూసుమంచి 29 మంది 46 ఎకరాలు, ఖమ్మం అర్బన్ 24 మంది 35 ఎకరాలు, కామేపల్లి 12 మంది 25 ఎకరాలు, రఘునాథపాలెం మండలంలో ఆరుగురు 8 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. భద్రాద్రి జిల్లావ్యాప్తంతా 30 మంది రైతులు 80 ఎకరాల్లో సాగు చేస్తున్న పంటలు నష్టపోయారని వ్యవసాయశాఖ వెల్లడించింది.