ఖమ్మం, నవంబర్ 13:ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించే గ్రూప్-3 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని టీజీపీఎస్సీ చైర్మన్ ఎం.మహేందర్‌రెడ్డి సూచించారు. ‘గ్రూప్-3’ పరీక్షల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. అన్ని దశల్లోనూ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, ఎక్కడా లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు చేపట్టాలని, స్ట్రాంగ్ రూములను పటిష్టంగా చేయాలని ఆదేశించారు. చీఫ్ సూపరింటెండెంట్‌కు తప్ప మరెవ్వరికీ పరీక్షా కేంద్రం లోపలికి మొబైల్ ఫోన్ తీసుకెళ్లడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు.
పరీక్షల విధుల సిబ్బంది, అధికారులు.. పరీక్షా కేంద్రానికి ముందస్తుగా చేరుకొని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. అబ్జర్వర్, రూట్ ఆఫీసర్, ఫ్లయింగ్ స్వాడ్, శాఖాధికారి, చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్లు సహా అన్ని స్థాయిల అధికారులకు ఈ పరీక్ష నిర్వహణ విషయమై తగు శిక్షణ ఇచ్చి పరీక్షలు సజావుగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఖమ్మం నుంచి అదనపు కలెక్టర్ (ఏసీ) శ్రీజ మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో 27,984 మంది అభ్యర్థులు గ్రూప్-3 పరీక్షలు రాయనున్నారని, వీరి కోసం 87 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశామని వివరించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ పటిష్ట చర్యలు చేపట్టినట్లు తెలిపారు. డీఆర్వో రాజేశ్వరి, కలెక్టరేట్ ఏవో అరుణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.