దమ్మపేట రూరల్, ఏప్రిల్ 12: పురుగుమందు తాగి కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మందలపల్లి గ్రామానికి చెందిన అడపా నరసింహారావు అలియాస్ చంటి (38)కి ఒక్క సెంటు వ్యవసాయ భూమి కూడా లేదు. చాలా సంవత్సరాలుగా కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు.
ఇటీవల కొన్నేళ్లుగా కౌలు భూమిలో హైబ్రిడ్ మొక్కజొన్న (విత్తన మొక్కజొన్న) సాగు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో నిరుడు సుమారు 30 ఎకరాల్లో హైబ్రిడ్ మొక్కజొన్న సాగు చేయగా ఆశాజనకమైన వచ్చింది. దీంతో ఈ ఏడాది వంద ఎకరాలకుపైగా కౌలుకు తీసుకొని అదే హైబ్రిడ్ మొక్కజొన్నను సాగు చేశాడు. అయితే, ఈ ఏడాది పంట దిగుబడి ఆశాజనకంగా రాలేదు. గణనీయంగా తగ్గింది. దీంతో భూయజమానులకు చెల్లించాల్సిన కౌళ్లు, పంట పెట్టుబడికి తెచ్చిన అప్పుల ఎలా తీర్చాలో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. అదే ఒత్తిడితో శనివారం సాయంత్రం అదే మండలంలోని అచ్యుతాపురం క్రాస్ రోడ్డు శివారులో తాను సాగుచేసిన మొక్కజొన్న పొలంలోనే పురుగుమందు తాగాడు.
ఎవరూ గమనించకపోడంతో అక్కడే మృతిచెందాడు. ఆ తరువాత రాత్రి సమయంలో అటుగా వెళ్లిన గ్రామస్తులు.. చంటి విగత జీవిగా పడి ఉండడాన్ని గమనించి అతడి కుటుంబీకులకు తెలియజేశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య కుమారి ఫిర్యాదు మేరకు దమ్మపేట పోలీసులు కేసు నమోదు చేశారు.