బూర్గంపహాడ్(భద్రాచలం), సెప్టెంబర్ 15 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పేరుతో యూఎస్ఏకు చెందిన ఆలయ నిర్వాహకులు విరాళాలు సేకరిస్తున్నట్లు గుర్తించామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి(ఈవో) రమాదేవి తెలిపారు. ఆదివారం ఆలయంలోని చిత్రకూట మండపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలను ఆమె వివరించారు.
భద్రాద్రి శ్రీరామ టెంపుల్ ఆఫ్ యూఎస్ఏ పేరుతో ఆలయానికి విరాళాలు సేకరిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, శ్రీరామ టెంపుల్ పేరుతో కోట్లాది రూపాయలు యూఎస్ఏ ఆలయ నిర్వాహకులు వసూలు చేశారన్నారు. ఖగోళయాత్రలో భద్రాద్రి శ్రీరామ టెంపుల్ ఆఫ్ యూఎస్ఏ పేరుతో భద్రాచలంలోని ఆర్యవైశ్య సత్రంలో సీతారాముల కల్యాణం చేసేందుకు యూఎస్ఏ అర్చకులు సిద్ధం చేసుకున్నారని తెలిపారు. భద్రాద్రి పేరుతో ఎవరైనా విరాళాలు సేకరించినా, భద్రాద్రి ఆలయ పేరును వాడినా వారిపై దేవాదాయశాఖ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
భద్రాద్రి శ్రీరామ టెంపుల్ ఆఫ్ యూఎస్ఏ పేరుతో లెటర్ప్యాడ్ను టైప్ చేయించి ఖగోళయాత్ర కోసమని ఈ విరాళాల సేకరణకు యూఎస్ఏ ఆలయ అర్చకులు పాల్పడుతున్నారని ఈవో వెల్లడించారు. విరాళాలు సేకరిస్తున్న విషయాన్ని రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ ఏఈవో భవానీ రామకృష్ణ, ఆలయ ఈఈ రవీందర్రాజు, ఆలయ అర్చకులు రామస్వరూప్, అమరవాది విజయరాఘవన్, గోపి, కిరణ్కుమార్, ఆలయ సూపరింటెండెంట్ సాయిబాబా పాల్గొన్నారు.