భద్రాచలం, డిసెంబర్ 5: ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఏ పార్టీలో ఉన్నాడో ముందుగా ప్రజలకు చెప్పిన తర్వాతే పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేయాలని, అప్పటివరకు ఆయనను భద్రాచలం ప్రజలు నమ్మరని ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బండారు రవికుమార్, జీడీపీ కన్వీనర్ గుండు శరత్‌లు అన్నారు. బీఆర్ఎస్, సీపీఎం, జీడీపీ, ఆదివాసీ జేఏసీ కూటమి ఆధ్వర్యంలో భద్రాచలంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. భద్రాచలంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే.. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేనంటూ చెప్పుకునే తెల్లం వెంకట్రావుకు మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడిగే హక్కు ఎక్కడుందని ప్రశ్నించారు.
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన వారు గెలిస్తే తన కోటాలో వేసుకుంటారని, ఓడిపోతే పొదెం వీరయ్యపై నింద వేయాలని చూస్తున్నారన్నారు. ఎమ్మెల్యేగా ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. భద్రాచలంలో కూటమి అభ్యర్థులకు ఆర్థిక బలం లేదు కానీ, ఆశయ బలం ఉన్నదని, భద్రాద్రి అభివృద్ధికి తామంతా కట్టుబడి ఉంటామని వారు పేర్కొన్నారు. ఇక్కడ జరిగే సర్పంచ్ ఎన్నిక రాబోయే కాలంలో జరుగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికకు రెఫరెండం అవుతుందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి.. 17 శాతం మాత్రమే ఇచ్చి మోసం చేసిందని మండిపడ్డారు. ఆ పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థులకు బీసీలంతా ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్ పాలనలో పదేళ్లలో రాష్ట్రం, పల్లెలు ఎంతో అభివృద్ధి చెందాయని, కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి అంతా కుంటుపడిందన్నారు. పారిశుధ్యం, వీధి దీపాలు, మురుగు కాల్వలు, పార్కుల నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారన్నారు.
ఎన్నికల ముందు ఎన్నో ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గెలిస్తే భద్రాచలంలో ఇసుక, గంజాయి మాఫియా పెరిగిపోతుందని తెలిపారు. అందరితో కలిసిపోయి సౌమ్యుడిగా ఉండే మానె రామకృష్ణతోపాటు కూటమి బలపరిచిన 20 వార్డు సభ్యుల అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ ఐదు రోజులపాటు ప్రతీ కార్యకర్త సైనికుల్లా పనిచేసి సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల గుర్తులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాల్లోకి వచ్చిన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు పూర్తిగా భద్రాచలం స్వరూపం తెలియదని వారు పేర్కొన్నారు. సమావేశంలో కూట మి నాయకులు రావులపల్లి రాంప్రసాద్, సీపీఎం నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు, ఏజే రమేశ్, గడ్డం స్వామి, ఆకోజు సునీల్, నర్సారెడ్డి, కోటగిరి ప్రబోద్‌కుమార్, రేపాక పూర్ణ తదితరులు పాల్గొన్నారు.