ఖమ్మం, ఏప్రిల్ 27: మహా కుంభమేళాను తలపించేలా లక్షలాది మంది ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎల్కతుర్తి సభకు తరలివెళ్లడంపై ఖమ్మంలోనూ చర్చనీయాంశమైంది. ఎల్కతుర్తి సభలో ఏం మాట్లాడుతారోనంటూ ఆదివారం మధ్యాహ్నం నుంచే ఖమ్మం జిల్లాలోని వ్యాపారులు, ఉద్యోగులు, మహిళలు, యువకులు ఆసక్తిని ప్రదర్శించారు. సాయంత్రం 5 గంటలకెల్లా టీవీలకు అతక్కుపోయారు. సభలో కేసీఆర్ ప్రసంగం ముగిసే వరకూ టీవీల ముందు నుంచి కదల్లేదు. పనులు, ప్రయాణాల్లో ఉన్న వారు తమ సెల్ఫోన్లలో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు.
అన్ని వర్గాల ప్రజలూ టీవీల ముందు కూర్చొని సభను చూస్తూ కేసీఆర్ ప్రసంగాన్ని ఆసాంతం విన్నారు. కేసీఆర్ స్పీచ్ ప్రసారమైనంత సేపూ మరో చానెల్‌ను పెట్టిన వారు లేరంటే అతిశయోక్తి లేదు. టీస్టాళ్లు, బార్లు, హోటళ్లు సహా బస్టాండ్లలోని టీవీల్లోనూ కేసీఆర్ ఉపన్యాసాన్నే వీక్షించారు. ఎక్కడ నలుగురు గుమికూడినా కేసీఆర్ ప్రసంగం, ఎల్కతుర్తి సభ, లక్షలాదిగా తరలివచ్చిన జనం గురించే చర్చించుకున్నారు. ఆటోలు, బస్సుల్లో ప్రయాణించేవారు కూడా రజతోత్సవ సభ ప్రసంగం గురించే మాట్లాకోవడం గమనార్హం. కాగా, సభ విజయవంతంపై బీఆర్ఎస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశాయి.