సత్తుపల్లి, జూలై 24 : పేదరికంలో పుట్టినా ఉమ్మడి పాలనలో మరింతగా వెనుకబడ్డారు. చేసుకునే వృత్తులకు చేయూతనిచ్చేవారు.. ఆర్థిక సాయం అందించి ఆదుకునేవారు కరువయ్యారు. గత ప్రభుత్వాల హయాంలో మైనార్టీలు ఎదుగూ బొదుగూ లేని జీవితాలను గడిపారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ ఆదుకుంటున్నారు. కులమతాలకతీతంగా సాయం అందించి వారి అభివృద్ధికి అండగా నిలుస్తున్నారు. మైనార్టీలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రూ.లక్ష సాయం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో మైనార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. దళితబంధు, బీసీ కుల సంఘాలను అందిస్తున్న మాదిరిగా మైనార్టీలకూ సాయం చేయడానికి సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వంద శాతం సబ్సిడీతో రూ.లక్ష సాయం అందించడానికి పూనుకున్న ప్రభుత్వం ఆదివారం జీవో కూడా జారీ చేసింది. దీంతో జిల్లాలోని ముస్లిం, క్రిస్టియన్ కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
పథకాల అమలుతో ముందుకు..
కులమతాలకతీతంగా పేదరిక నిర్మూలనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తూ ముందుకు సాగుతోంది. అందులో భాగంగా మైనార్టీల్లో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి కల్పనతోపాటు సంస్థాగత అభివృద్ధే లక్ష్యంగా పలు వినూత్న కార్యక్రమాలు రూపొందించి సమర్థంగా అమలు చేస్తున్నది. ఉమ్మడి పాలనతో పోల్చితే స్వరాష్ట్రంలో మైనార్టీల్లో నెలకొన్న పేదరికం, వెనుకబాటుతనం 70 శాతానికి పైగా తగ్గినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మిగిలిన 30 శాతాన్ని కూడా పారదోలే క్రమంలో సీఎం కేసీఆర్ 100 శాతం సబ్సిడీతో లక్ష రుణం అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బీసీలకు రూ.లక్ష సాయం అందిస్తున్న మాదిరిగానే 100 శాతం సబ్సిడీతో రూ.లక్ష ఆర్థిక సాయం చేయాలని నిర్ణయిస్తూ ఆదివారం జీవో 78 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని వర్గాలను సమాన దృష్టితో చూస్తూ.. వారి సంస్కృతులు, ఆచార సాంప్రదాయాలను గౌరవిస్తూ మైనార్టీలకు ఆర్థిక సాయం చేస్తుండడంతో జిల్లాలోని మైనార్టీ వర్గాలు, వారి కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
మార్గదర్శకాలివే..
ముస్లింలకు మైనార్టీ ఆర్థిక సంస్థ నుంచి, ఇతర మైనార్టీలకు క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ నుంచి ఆర్థిక సాయం అందిస్తారు. బీసీలకు అందిస్తున్న మాదిరిగానే పలు యూనిట్లకు పనిముట్లు కొనుగోలు, ఆధునీకరణ, ముడిసరుకు కొనుగోలుకు మాత్రమే సాయం అందజేస్తారు. ఈ పథకానికి 21 నుంచి 55 ఏళ్లలోపు వారు మాత్రమే అర్హులు. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలకు మించకూడదు. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. https//tsobmmsbc.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా మానిటరింగ్, స్క్రీనింగ్ కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. ఆ జాబితాకు కలెక్టర్లు, జిల్లా మంత్రుల ఆమోదం పొందాల్సి ఉంటుంది.
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట
తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది. అన్ని వర్గాల మాదిరిగానే మైనార్టీలకు కూడా సీఎం కేసీఆర్ రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించడం గొప్ప విషయం. హిందువుల కోసం కల్యాణలక్ష్మి, మైనార్టీల కోసం షాదీముబారక్‌ను ప్రవేశపెట్టి వారి కుటుంబాలకు భరోసా కల్పించారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఒక్క పథకం కూడా ప్రవేశపెట్టలేదు. ఇంతటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
– సండ్ర వెంకటవీరయ్య, సత్తుపల్లి ఎమ్మెల్యే
మైనార్టీలను గుర్తించింది సీఎం కేసీఆరే..
కరకగూడెం, జూలై 24 : మైనార్టీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నివిధాలుగా అండగా నిలుస్తున్నారని కరకగూడెం కోఆప్షన్ సభ్యుడు డాక్టర్ షేక్ సోందుపాషా అన్నారు. మైనార్టీలకు రూ.లక్ష సాయం బ్యాంకులతో సంబంధం లేకుండా అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని హర్షిస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎంపీపీ రేగా కాళికతో కలిసి మైనార్టీ నాయకులు సోమవారం క్షీరాభిషేకం చేశారు. మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మైనార్టీల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతోమంది పేదలకు మేలు చేస్తుందని అన్నారు. అనంతరం మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మైనార్టీ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మైనార్టీల పక్షపాతి కేసీఆర్
సీఎం కేసీఆర్ మైనార్టీల పక్షపాతి. ముస్లింల సంక్షేమాన్ని కోరుకునే ఏకైక నాయకుడు, స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లలో మైనార్టీల అభ్యున్నతికి పాటుపడింది సీఎం కేసీఆర్ సారే. మైనార్టీలు ఆర్థికంగా బలోపేతం కావాలన్న సీఎం కేసీఆర్ సంకల్పానికి ధన్యవాదాలు. ఆయన చేస్తున్న కృషికి తామంతా ఎల్లవేళలా రుణపడి ఉంటాం.
– షేక్ చాంద్‌పాషా, ఎన్టీఆర్ నగర్, సత్తుపల్లి