జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) సర్వీసును క్రమబద్ధీకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. జేపీఎస్‌ల పనితీరు మదింపునకు జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని సీఎం సూచించారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు హర్షం వ్యక్తం చేశారు. అన్ని మండలాల్లోనూ జేపీఎస్‌లు మంగళవారం సంబురాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు, చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని ఆనందాన్ని పంచుకున్నారు. ప్రభుత్వం ఇంత త్వరగా రెగ్యులరైజేషన్ చేస్తుందని అనుకోలేదని జేపీఎస్‌లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు, తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ముక్తకంఠంతో పేర్కొంటున్నారు.
-నమస్తే నెట్వర్క్, మే 23
మామిళ్లగూడెం, మే 23: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్)కు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. వారి సర్వీసును క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు విధి విధానాలను ఖరారు చేయాలని, పని తీరును మదింపు చేసేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో కమిటీలు వేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాను ఆదేశించారు. దీంతోపాటు ఖాళీగా ఉన్న స్థానాల్లో నూతన జేపీఎస్‌లను నియమించాలని ఆదేశించారు. జిల్లాలో 589 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటిలో ఇప్పటికే 459 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పని చేస్తున్నారు. మరో 21 మంది ఔట్ సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్నారు. మరో 4 స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
క్రమబద్ధీకరణకు కార్యాచరణ ఇలా..
జేపీఎస్‌ల క్రమబద్ధీకరణకు వారి పని తీరును ప్రామాణికంగా తీసుకోనున్నారు. మదింపు కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని నిర్ణయించారు. ఎవరెవరిని క్రమబద్ధీకరించాలనే విషయంపై తుది సిఫార్సులతో ఈ కమిటీలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక పంపుతాయి. అనంతరం జేపీఎస్‌ల క్రమబద్ధీకరణపై ఉత్తర్వులు జారీ అవుతాయి. కొన్ని పంచాయతీల్లో తాతాలిక ప్రాతిపదికన జూనియర్ పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్లు నియమించారు. ఈ స్థానాల్లోనూ కొత్త జేపీఎస్‌లను భర్తీ చేయాలని, క్రమబద్ధీకరణ పూర్తయిన తర్వాత ఈ ప్రక్రియను చేపట్టాలని సీఎం ఆదేశించారు. జేపీఎస్ క్రమబద్ధీకరణకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే జారీ చేస్తామని ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించారు.
జిల్లాలో జేపీఎస్‌ల వివరాలు ఇలా..
జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారు. మండలాల వారీగా చూస్తే.. బోనకల్లులో 17 మంది, చింతకానిలో 21, ఏన్కూరులో 24, కల్లూరులో 25, కామేపల్లిలో 20, ఖమ్మం రూరల్‌లో 19, కొణిజర్లలో 22, కూసుమంచిలో 34, మధిరలో 21, ముదిగొండలో 18, నేలకొండపల్లిలో 21, పెనుబల్లిలో 27, రఘునాథపాలెంలో 28, సత్తుపల్లిలో 13, సింగరేణిలో 34, తల్లాడలో 21, తిరుమలాయపాలెంలో 34, వేంసూరులో 21, వైరాలో 16, ఎర్రుపాలెంలో 23 మంది ఉన్నారు.