కేసీఆర్.. ఈ ఒక్కమాటే వెయ్యి ఏనుగుల బలం.. ప్రజలకు కొండంత అండ.. ఉద్యమ సమయంలో ఉద్యమ దివిటీగా ముందుండి పోరాడిన ధీశాలి.. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా జనరంజక పాలన అందిస్తున్న మహానేత.. మరే ఇతర రాష్ట్రంలో అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.. యావత్ భారతమంతా తెలంగాణ వైపు చూసేలా రాష్ర్టాన్ని అగ్రస్థానంలో నిలిపారు.. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు అనేక వరాలిచ్చారు.. పోస్టుల భర్తీకి జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.. ఉద్యోగోన్నతుల ప్రక్రియను సులభతరం చేశారు.. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ కార్యశూరుడు అంటున్నారు ప్రభుత్వ అధికారులు. ఆయన జాతీయ పార్టీ స్థాపించి దేశ రాజకీయాల్లో రాణించాలని ఆకాంక్షిస్తున్నారు.
ఖమ్మం, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేసీఆర్.. ఈ ఒక్క మాట.. ఒక శక్తి.. తెగువతో, సాహసంతో తెలంగాణ కోసం పోరాడిన ధీశాలి. ప్రజలు, ఉద్యమకారులను కలపుకొని స్వరాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ నేత. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని రాష్ర్టాన్ని బంగారు తెలంగాణ వైపు నడిపిస్తున్నారు. ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి దేశ రాజకీయాల్లోనూ సత్తా చాటాలని ఉమ్మడి జిల్లా ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరుతున్నారు. దేశ ఆర్థిక స్థితి గతులను గాడిలో పెట్టే సమర్థత ఆయనకే ఉందన్నారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న బీజేపీని పారద్రోలే శక్తి కేసీఆర్‌కు మాత్రమే ఉందంటున్నారు. బీజేపీవి ఏకపక్ష విధానాలంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నదన్నారు. వాటన్నింటిని తిప్పి కొట్టి దేశ ప్రజలకు మేలు చేసే సమర్థత కేసీఆర్‌కు ఉందన్నారు. .. వివరాలు వారి మాటల్లోనే..
కేసీఆర్‌తోనే మార్పు..
మతోన్మాదుల చేతిలో ఉన్న పార్టీకి నేతృత్వం వహిస్తున్న నాయకుడు దేశాన్ని పాలిస్తున్నాడు…ఆ పార్టీ విధానాల కారణంగా దేశంలో మైనార్టీలు జీవించలేని పరిస్థితి నెలకొంది..భారత పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను హరిస్తున్నారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో కేసీఆర్ లాంటి నాయకుడి అవసరం దేశానికి ఎంతో ఉంది..ఆయన అంకుటిత దీక్ష వలన జాతీయ రాజకీయాల్లో పెనుమార్పులు రావడం ఖాయం. –షేక్ అప్జల్ హసన్ (టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు, ఖమ్మం)
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి
భూమిని నమ్ముకున్న రైతులు ఎంతో కాలంగా భూసమస్యలను ఎదుర్కొన్నారు. సమస్యలకు పరిష్కారం దొరకక అల్లాడిపోయారు. భూమి హద్దులు తెలియక, పట్టా పుస్తకాలు అందక ఇబ్బందులు పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన ధరణితో భూసమస్యలకు పరిష్కారం లభించింది. దళారుల ఆగడాలకు తెరపడింది. రైతులు స్లాట్ బుక్ చేసుకుంటే చాలు పాస్‌పుస్తకాలు సులభంగా రైతులకు అందే విధంగా ఇప్పుడు నిబంధనలు ఉన్నాయి. ఇంతకంటే రైతులకు ఏం కావాలి. తాతల నాటి నుంచి పరిష్కారం కాని సమస్యలకు ఒక్క పోర్టల్ పరిష్కారం చూపించింది. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవు. ఇలాంటి పథకాలు దేశమంతటా అమలు కావాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి.
– భగవాన్‌రెడ్డి, రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు, తహసీల్దార్, బూర్గంపాడు
సింగరేణికి మేలు జరుగుతుంది..
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే సింగరేణికి మేలు జరుగుతుంది. దక్షిణ భారతంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి పరిశ్రమను ప్రైవేటు వ్యక్తుల చేతులోకి వెళ్లకుండా కేసీఆర్ అడ్డుకుంటారు. అవరమైతే మన వాటా మనమే కొనుగోలు చేసేలా ఉద్యమిస్తారు. సంస్థ పూర్తిగా మనదే అయితే రాష్ట్రంలో ఇంకా ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించవచ్చు.
– కనకం కుమారస్వామి,
జీకేవోసీ సీనియర్ హెడ్ ఓవర్ మెన్, చుంచుపల్లి
జాతీయ రాజకీయాల్లో మార్పు తథ్యం
కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళితే మార్పులు తథ్యం. బీజేపేతర శక్తులను ఏకతాటిపైకి తెచ్చి రానున్న వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ తప్పకుండా విజయం సాధిస్తారు. జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తే దేశవ్యాప్తంగా ఎంతోమంది నేతలు ఆయనకు మద్దతు ఇస్తారు. కేసీఆర్ మరికొందరు పేరున్న నేతలను కలుపుకుంటే మరింత మేలు. ప్రస్తుతం బీజేపీ దేశంలో మతతత్వ రాజకీయాలను ప్రేరేపిస్తున్నది. ఎన్నికల సమయంలో సరిహద్దులో చైనా, పాకిస్తాన్ యుద్ధాలంటూ ఓట్లు రాబట్టుకుంటున్నాయి. అన్నివర్గాలకు సమప్రాధాన్యం ఇచ్చే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే దేశ ప్రజలందరికీ మేలు జరుగుతుంది.
– గుమ్మడదల సుబ్బారావు,
రిటైర్డ్ కమాండెంట్ స్పెషల్ పోలీస్ బెటాలియన్స్ (ఎస్పీ)
కేసీఆర్ జాతీయ నేతగా రాణిస్తారు..
జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళితే ప్రజలకు మేలు జరుగుతుంది. ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టే సత్తా కేసీఆర్‌కు ఉంది. ఉద్యమ నేతగా స్వరాష్ట్రం తెచ్చిన కేసీఆర్ దేశ్ కీ నేతగా ఎదుగుతారనే నమ్మకం ఉంది. ఆయన జాతీయ రాజకీయాల్లో రాణిస్తారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల వంటివి దేశ ప్రజలందరికీ అందించేందుకు కృషి చేస్తారు. దేశంలో ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఉంది. సామాజిక అసనమానతలు ఉన్నాయి. వాటన్నింటినీ సవరించే సమర్థత కేసీఆర్‌కు ఉంది.
– మల్లెల రవీంద్రప్రసాద్, పంచాయతీరాజ్ సర్వీస్ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, ఖమ్మం
దేశానికి కేసీఆర్ విజన్ అవసరం
తరతరాలుగా దోపిడీకి గురైన తెలంగాణ ప్రాంతానికి విముక్తి కల్పించేందుకు కంకణం కట్టుకున్న మహానేత కేసీఆర్. 13 ఏళ్ల పాటు ఉద్యమించి ప్రజల్లో చైతన్యం రగిల్చి స్వరాష్ర్టాన్ని సాధించారు. ఒంటిచేత్తో ఉద్యమాన్ని నడిపించిన రథసారధి. అపర చాణక్యుడు ఆయన. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవు. దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళితే ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రజల కష్టాలకు పరిష్కారం దొరుకుతుంది. కేసీఆర్ వంటి విజన్ ఉన్న నాయకుడి సేవలు ప్రస్తుతం దేశానికి ఎంతో అవసరం.
– సునీల్‌కుమార్‌రెడ్డి, తహసీల్దార్, సుజాతనగర్
దేశానికి దమ్మున్న నాయకత్వం అవసరం..
రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలు తీరాయి అంటే దానికి కారణం సీఎం కేసీఆర్. జోనల్ వ్యవస్థను అమలు చేయడంతో అధికారులు తక్కువ పరిధిలోనే కొలువులు చేస్తున్నారు. ఈ పద్ధతిలో ప్రమోషన్లు సులభమయ్యాయి. రాష్ర్టాన్ని జిల్లా, జోన్, మల్టీ జోన్లు విభజించడంతో ఉద్యోగులకు ఎంతో మేలు జరిగింది. పేరి విజన్ కూడా ఉద్యోగులకు అనుకూలమైంది. నిరుద్యోగం పరిష్కారానికి కొత్తగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇవన్నీ కేసీఆర్‌తోనే సాధ్యమయ్యాయి. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళితే ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి దమ్మున్న నాయకత్వం అవసరం.
– అమర్నేని రామారావు, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు, కొత్తగూడెం
రాజకీయవేత్త కేసీఆర్..
రాజకీయవేత్త సీఎం కేసీఆర్. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరే ఇతర రాష్ట్రంలోనూ అమలు కావడం లేదు. మొదటి నుంచి కేసీఆర్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పక్షపాతి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆయన అనేకసార్లు ఉద్యోగులు, ఉపాధ్యాయులను ప్రశంసించారు. వారి సంక్షేమం కోసం అనేక వరాలు ఇచ్చారు. విద్యావ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారు. ప్రతిష్ఠాత్మకంగా ‘మన ఊరు-మన బడి’ని అమలు చేస్తున్నారు. అలాంటి జాతీయ రాజకీయాల్లోకి వెళితే దేశ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.
– నర్సింశెట్టి విజయ్, ఉపాధ్యాయుడు
కేసీఆర్‌తోనే జనరంజక పాలన..
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే రాష్ట్రంలో అమలవుతున్నట్లుగానే దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు అమలవుతాయి. రైతు సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా, రైతుమాఫీ పథకాలు అమలవుతున్నట్లు గానే దేశవ్యాప్తంగా రైతాంగానికి పథకాలు అమలవుతున్నాయి. పంటలకు ఉచితంగా కరెంట్ అందుతుంది. కేసీఆర్‌తోనే జనరంజక పాలన సాధ్యం.
– కస్తాల సత్యనారాయణ, టీజీవోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి,
ఖమ్మం
వ్యవసాయ రంగం గాడిన పడుతుంది.
భారత్‌లో 65 శాతం మంది వ్యవసాయ రంగం, వ్యవసాయాధారిత రంగాలపై ఆధారపడి జీవిస్తారు. ఒక్క తెలంగాణలోనే 65 లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్నది. దీనితో పాటు ఇతర పంటలు సాగవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతుబీమా, రైతుబంధు,రుణమాఫీ పథకాలను అమలు చేస్తున్నది. సకాలంలో విత్తనాలు, ఎరువులు సమకూరుస్తున్నది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలు చేయలేమని ప్రకటించింది. పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వడం లేదు. సీఎం కేసీఆర్ అందిస్తున్న రైతు సంక్షేమ పథకాలతో రైతాంగం లబ్ధిపొందుతున్నది. ఇదంతా కేసీఆర్ విజన్‌తోనే సాధ్యమవుతున్నది. క్షేత్రస్థాయిలోకి వెళ్లి పనిచేసిన రాజకీయ అనుభవం ఉంది. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళితే వ్యవసాయ రంగం గాడిలో పడుతుంది.
– దొడ్డిగర్ల బాలాజీ, వ్యవసాయశాఖ మండల అధికారి, కొణిజర్ల
వందకు వందశాతం జాతీయ పార్టీ సక్సెస్ అవుతుంది..
కేసీఆర్ రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా ఇప్పటివరకు విఫలం కాలేదు. అలాగే జాతీయ పార్టీ పెట్టినా వందకు వందశాతం సక్సెస్ అవుతుంది. జాతీయ పార్టీలు ఉన్నప్పటికీ వాటి ఉనికిని కాపాడుకోలేక పోతున్నారు. బేజీపీ ప్రభుత్వంపై పోరాటం చేసే సత్తా లేకుండా పోయింది. బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న ఒంటెద్దు నిర్ణయాలను ఏ ఒక్క జాతీయ పార్టీ ఆశించిన మేర విమర్శించలేక, ప్రజలకు వివరించలేని స్థితిలో ఉన్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా సీఎం కేసీఆర్ ఒకే ఒక్కడుగా బీజేపీ ప్రభుత్వంపై ఒంటిరి పోరాటం చేస్తున్నాడు. కేసీఆర్ పోరాటపటిమ ఎలా ఉంటదో యావత్ దేశప్రజలకు తెలుసు, నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒకే ఒక్కడితో ప్రారంభమైన ఉద్యమం యావత్ తెలంగాణ ప్రజలకు చేరువచేశాడు. ప్రతి పక్షపార్టీలు సైతం చివరికి కలిసిరాక తప్పలేదు.
నాడు జాతీయ పార్టీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రేస్ పార్టీలు సైతం టీఆర్ఎస్ పార్టీని నిలవరించేందుకు అకేక కుట్రలు పన్నాయి. అయితే ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉండటంతో స్వరాష్ట్ర సాధన సుసాధ్యం అయ్యింది. ప్రస్తుతం దేశ పరిస్థితి కూడ అదే విధంగా ఉంది. నియంతృత బీజేపీ ముక్త భారత్ కేవలం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని అనేక పార్టీల నాయకులు, దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. స్వచ్చమైన కేసీఆర్ ఆశయసాధనకు యావత్ దేశం అండగా నిలబడుతుంది. అందులో భాగంగానే ఇప్పటికే సగం రాష్టాలకు పైగా నాయకులు, ప్రజలు కేసీఆర్ వెంట నడిచేందుకు సిద్దంగా ఉన్నారు. తిరిగి భారతదేశం పూర్వ వైభవం సంతరించుకోవాలంటే కేసీఆర్ కొత్త జాతీయ రాజకియాలలోకి రావాల్సిన అవసరం అనివార్యం అయ్యింది. ఆర్థికంగా కుదేలు అవుతున్న ఆర్థికరంగం తిరిగి గాడిలో పడాలన్నా, దేశంలో పేరుకపోతున్న మతోన్మాదం కట్టడి కావాలన్నా సీఎం కేసీఆర్ జాతీయపార్టీ పెట్టి తీరాల్సిందే. మహిళల మద్దతు దేశవ్యాప్తంగా సంపూర్ణంగా ఉంటుంది. – బెల్లం ఉమ, ఎంపీపీ, ఖమ్మం రూరల్
కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి..
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన సమయం అసన్నమైంది. ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ కుదైలైంది. సామాన్యుడు, రైతులు బతికే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల నుంచి ప్రజలు బయటపడాలంటే రాజకీయాల్లో దీర్ఘకాలిక అనుభవం కలిగిన కేసీఆర్ వంటి నాయకుడు కావాలి. ఆయన దశాబ్దానికి పైగా ఉద్యమించి, ప్రజలందరినీ ఒక్కటి చేసి స్వరాష్ర్టాన్ని సాధించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు తీసుకున్నాక ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. వ్యవసాయరంగానికి ప్రాధాన్యం ఇవ్వడంతో వలస వెళ్లి వారూ తిరిగి స్వగ్రామాలకు వచ్చి పంటలు సాగు చేసుకుంటున్నారు. విద్య, వైద్య రంగాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులకు పింఛను అందున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి పథకాలు ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే ఇలాంటి పథకాలే దేశ ప్రజలందరికీ అందేలా కృషి చేస్తారు. కేసీఆర్ రైతు సంఘాలు, యువజన, విద్యార్థి, మహిళ, ట్రేడ్ యూనియన్లను కలుపుకొని జాతీయ స్థాయిలో ఎదగాలి. అప్పుడే దేశంలో నూతన శకం ప్రారంభమవుతుంది.
– గోపిశెట్టి వెంకటేశ్వరరావు, విశ్రాంత ఉపాధ్యాయుడు, పెనుబల్లి
దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరం
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో దేశాభివృద్ధికి సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరం. సీఎం ప్రజల గురించి పరితపించే వ్యక్తి. పేదల సంక్షేమం కోసం ఆలోచించే వ్యక్తి. ఈ కారణంతోనే ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. నేను బీసీ కార్పోరేషన్ కింద రూ.లక్ష రుణం పొందాను. దీనిలో రాయితీ 80శాతం పోను మిగిలిన 20శాతం మాత్రమే తిరిగి చెల్లించా. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కరెంట్ కోతల బాధ తప్పింది. ఇళ్లు, పొలాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతున్నది. మిషన్ భగీరథతో ఇంటింటికీ శుద్ధజలం అందుతున్నది. గ్రామాల్లో అంతర్గ రోడ్లు వచ్చాయి. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే దేశమంతా ఇలాంటి పథకాలే అమలవుతాయి. ప్రజల జీవితాలు మారుతాయి. రాష్ర్టాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్న తీరుగానే కేసీఆర్ దేశాన్నీ ప్రగతి వైపు నడిపిస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆయనకు బీసీ సంఘం తరఫున మద్దతు తెలుపుతున్నాం.
– బెజ్జంకి కనకాచారి, బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, సారపాక
తెలంగాణ ఉద్యమ తరహాలో కేంద్రంపై పోరాడాలి
తెలంగాణ కోసం ఉద్యమించినట్లుగానే సీఎం కేసీఆర్ కేంద్రంపై పోరాడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆయన జాతీయ పార్టీ స్థాపించి బీజేపీ వైఫల్యాలను ఎండగట్టాలి. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. కేసీఆర్ గట్టిగా పోరాడితే వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపేతర ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. జాతీయ పార్టీ స్థాపిస్తే ఆయన వెంట నడిచేవారెందరో ఉన్నారు. ఢిల్లీ గడ్డపై తనదైన మార్కు చూపిస్తారనే నమ్మకం మాకుంది.
– వంకాయలపాటి సత్యనారాయణ, తెలంగాణ ఉద్యమకారుడు, నాగులవంచ, చింతకాని మండలం
కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న ఒకే ఒక్క నేత కేసీఆర్
కేంద్రంలోని బీజేపీ ప్రజల్లో మత చిచ్చు పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నది. దేశవ్యాప్తంగా ఒక్క కేసీఆర్ తప్ప ఎవరూ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు. కేంద్రాన్ని ప్రశ్నించగల నేత కేసీఆర్. ఆయన అనుకున్న పని అనుకున్నట్లు పూర్తి చేస్తారు. జాతీయ రాజకీయాల్లోనూ ఉద్యమ పంథాను అనుసరించి తప్పకుండా విజయం సాధిస్తారు. కేసీఆర్‌తోనే ఆదివాసీలు, గిరిజనులకు న్యాయం జరుగుతుంది. కేసీఆర్ మాట ఇస్తే నిలబెట్టుకుంటారు. ఇటీవల ఆయన దేశవ్యాప్తంగా పలు రైతు సంఘాల నాయకులతో భేటీ అయ్యారు. దేశం మొత్తం 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తానని సంకల్పించడం హర్షణీయం. ఆయన అనుకున్నవన్నీ సాధించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
– కాకా మహేశ్, ఆదివాసీ సంఘం నాయకుడు, చండ్రుగొండ
ప్రతిఒక్కరూ స్వాగతించాలి..
కేసీఆర్ లాంటి ఉద్యమనేత దేశ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని ప్రతిఒక్కరూ స్వాగతించాలి. తెలంగాణ ఉద్యమకారుల వెన్నుదన్నుగా నిలిచి దశాబ్దాల స్వరాష్ట్ర కలను నిజం చేసిన మహోన్నతుడు కేసీఆర్. ఎనిమిదేళ్ల పాలనలో ఆయన తెలంగాణను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపారు. రిజర్వ్‌బ్యాంక్, కాగ్ ఇచ్చిన ఆర్థిక సూచికల ప్రకారం విద్య, వైద్యం, సంక్షేమం, ఆర్థిక, వ్యవసాయ, ఐటీ పారిశ్రామిక రంగాల్లో రాష్ట్రం ముందున్నది. కేసీఆర్ విజన్‌తోనే పోలీస్ కమాండ్ కంట్రోల్‌రూం, ఐటీ హబ్స్, నూతన సెక్రటేరియట్, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, యాదాద్రి దేవాలయం వంటి గొప్ప నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంతటి సమర్థత ఉన్న నాయకుడు దేశ రాజకీయాల్లోకి వెళితే కచ్చితంగా ప్రజలకు మంచి జరుగుతుంది.
– పొనుగోటి కిషన్‌రావు, సీనియర్ న్యాయవాది, మణుగూరు
సింగరేణి ప్రైవేట్‌పరం కాకుండా కాపాడాలి
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో వెళ్లి జాతీయ పార్టీ పెట్టాలి. కార్మికుల ఆకాంక్షలు నెరవేర్చాలి. ఇప్పటికే సింగరేణి కార్మికుల మేలు కోసం కేసీఆర్ ఎంతో చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలపై ఆయనకు అభిమానం ఉంది. ఆయా సంస్థలు మనుగడ సాధించాలంటే కేసీఆర్ వంటి నాయకుడు రావాల్సిందే. సింగరేణి సంస్థను ప్రైవేట్‌పరం చేసే కుట్రలను తిప్పికొట్టే శక్తి కేసీఆర్‌కు ఉంది. సంస్థ ప్రైవేటుపరం కాకుండా చూస్తారని కార్మికులందరూ విశ్వసిస్తున్నారు. కేసీఆర్ ఆ పని చేసి చూపిస్తారనే నమ్మకం ఉంది.
– ముప్పాని సోమిరెడ్డి, టీబీజీకేఎస్ కార్పొరేట్ ఉపాధ్యక్షుడు