‘సీతారామ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు పూర్తయితే జిల్లా ప్రజల సాగునీటి కష్టాలు పూర్తిగా తీరుతాయి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధజలం పంపిణీ చేస్తున్నాం. తండాలు, ఆదివాసీ గూడేలు పంచాయతీలుగా మారాయి. గిరిజనుల దశాబ్దాల పోడు పట్టాల కల బీఆర్ఎస్ హయాంలోనే నెరవేరింది. రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే. బీఆర్ఎస్తోనే మన్యం అభివృద్ధి సాధ్యం’ అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. భద్రాద్రి జిల్లా దమ్మపేట మండల పరిధిలోని అప్పారావుపేటలో సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు.
ఖమ్మం, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని, బీఆర్ఎస్తోనే మన్యం అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేటలో సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. సీతారామ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, ప్రాజెక్టు పూర్తయితే జిల్లా ప్రజల సాగునీటి కష్టాలు పూర్తిగా తీరుతాయని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధజలం పంపిణీ చేస్తున్నామన్నారు. మారుమూల గ్రామాల్లో సైతం నల్లా కనెక్షన్లు ఇచ్చామన్నారు. దీంతో గూడేల్లో అనారోగ్య సమస్యలకు పరిష్కారం దొరికిందన్నారు.
ఆదివాసీలు, గిరిజనులను టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు కేవలం ఓటు బ్యాంక్‌గానే చూశాయే తప్ప, వారి బాగోగులను పట్టించుకోలేదని సీఎం ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే తండాలు, ఆదీవాసీ గూడేలు పంచాయతీలుగా మారాయని అన్నారు. ఇప్పుడు గిరిజనులే తమ ప్రాంతాలను పాలించుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా ప్రస్తుతం రహదారులు దర్శనమిస్తున్నాయన్నారు. ఆంధ్రాకు సరిహద్దు అయిన అశ్వారావుపేట, దమ్మపేట ప్రాంతాల ప్రజలకు ఆంధ్రాలో రహదారులు ఎలా ఉన్నాయే తెలుసునన్నారు. అశ్వారావుపేట బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు సౌమ్యుడు, సాత్వికుడు అని అన్నారు. ప్రజలు ఎన్నికల్లో మెచ్చాను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అశ్వారావుపేటకు సెంట్రల్ లైటింగ్ మంజూరు చేసేదాకా మెచ్చా తనను వదల్లేదన్నారు.
గిరిజనుల దశాబ్దాల కల అయిన పోడు భూములకు పట్టాల సమస్యను తామే పరిష్కరించామని అన్నారు. ఉమ్మడి జిల్లాలో వేలాది మంది గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చామన్నారు. రైతుబంధు, రైతుబీమా కూడా వర్తింపజేస్తున్నామని అన్నారు. పోడు భూములపై హక్కుల కోసం పోరాటం చేసిన గిరిజనులపై ఉన్న కేసులను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఎత్తివేసిందన్నారు.
ఎన్నికలు వస్తే కాంగ్రెస్ నేతలు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తారని, ఎన్ని వాగ్దానాలు చేసినా, ఎన్ని అబద్ధాలు ఆడినా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కల్ల అని సీఎం స్పష్టం చేశారు. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతుబంధును బంగాళాఖాతంలో కలుపుతామని అంటున్నారని, అలాగే మరో కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతుబంధును దుబారా అంటున్నారని విమర్శించారు. రైతుబంధు కావాలా..? వద్దా? అని సీఎం సభాముఖంగా ప్రజలను ప్రశ్నించగా.. ప్రజలు ‘రైతుబంధు కావాలి..’ అని పెద్దఎత్తున నినదిస్తూ సీఎంకు సమాధానమిచ్చారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని సీఎం స్పష్టం చేశారు. పంటలకు 24 గంటల విద్యుత్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు నిరంతారాయంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. రైతులు చల్లగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని, దేశం బాగుంటుందని, వారి సంక్షేమం కోసం తమ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తున్నదన్నారు. ధాన్యం కొనుగోలుపై ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తామని భరోసానిచ్చారు. సభలో బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీని వీడి ఇటీవల బీఆర్ఎస్లో చేరిన మహిళా నేతలు వగ్గెల పూజ, సున్నం నాగమణి పాల్గొన్నారు.
అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.800 కోట్ల వరకు మంజూరు చేశారు. అడిగిన వెంటనే నిధులు ఇచ్చి అభివృద్ధికి బాటలు వేశారు. అందుకు ప్రజల తరఫున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. కళ్ల ముందే అభివృద్ధి కనిపిస్తున్నది. ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలి. మాయ మాటలు చెప్పే ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు. ప్రజాసంక్షేమాన్ని కోరుకునే పార్టీకి పట్టంకట్టాలి. బీఆర్ఎస్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. మున్ముందు కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తాను. కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేసి ఎన్నికల్లో గెలవాలి. గెలుపును పార్టీ అధినేత కేసీఆర్‌కు కానుకగా అందించాలి.