భద్రాద్రి కొత్తగూడెం, జూలై 31 (నమస్తే తెలంగాణ)/ ఖమ్మం:ఇన్నాళ్లూ కార్పొరేషన్ ఉద్యోగులుగా కొనసాగిన వారంతా ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా తమ విధులు నిర్వర్తించనున్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పుట్టినప్పటి నుంచి డ్రైవర్లు, కండక్టర్లు, కార్మికులు, సిబ్బంది పడుతున్న కష్టాలు.. ఇబ్బందులను గుర్తించిన సీఎం కేసీఆర్ క్యాబినెట్ సమావేశంలో ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తూ సంచలనాత్మక నిర్ణయం తీసుకోవడంతో కార్మికులు ఆనంద పరవశులవుతున్నారు. గతంలో వారి వేతనాలు పెంచి.. నష్టాల్లో ఉన్న సంస్థకు తమవంతుగా చేయూతనిచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించనుండడంతో సంబురాల్లో మునిగి తేలుతున్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ తమకు మేలు చేసిన ప్రభుత్వాన్ని ఎప్పటికీ మరచిపోమని, జీవితాంతం రుణపడి ఉంటామని చెబుతున్నారు.
రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే లక్ష్యంతో ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ సోమవారం నిర్ణయించడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. క్యాబినెట్ నిర్ణయాన్ని టీవీలు, సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న టీఎస్ఆర్టీసీ కార్మికులు పలు చోట్ల సంబురాలు జరుపుకున్నారు. వారి కుటుంబాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయంతో ఆర్టీసీ ఖమ్మం రీజియన్‌లోని ఆరు డిపోలైన ఖమ్మం, సత్తుపల్లి, మధిర, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం పరిధిలో గల 2,300 మంది కార్మికులు ఇక మీదట ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందనున్నారు. వీరిలో 1,150 మంది కండక్టర్లు, 950 మంది డ్రైవర్లు, 300 మంది సూపర్వైజర్లు, ఇతర సిబ్బంది ఉన్నారు. ఖమ్మం రీజియన్‌లోని ఈ ఆరు డిపోల్లో కలిపి 550 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి.
ఇంతకంటే ఆనందం ఇంకేముంటుంది..?
రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం చాలా సంతోషంగా ఉంది. మమ్ములను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఆర్టీసీలో పనిచేస్తున్నప్పటికీ ఏదో ఒక వెలితిలా అనిపించేంది. కానీ ఇప్పుడు ఆ ఆందోళనలు తొలగిపోయాయి. మేము ఇకమీదట ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటే ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన అనేక బెనిఫిట్లను సులభంగా అందుకోగలం. ఇక ముందు మమ్ములను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారంటే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది.
-నాగవీర, కండక్టర్, ఖమ్మం
ప్రభుత్వ బెనిఫిట్స్ సులభంగా అందుతాయి..
టీఎస్ ఆర్టీసీ సంస్థను తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయిండం పట్ల గొప్ప విషయం. ఇందుకు కృషి చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు ప్రత్యేక కతజ్ఞతలు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో మేము ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతున్నామన్న ఆనందం కలుగుతోంది. ఈ వార్త వినప్పటి నుంచి మా కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేము ప్రభుత్వ ఉద్యోగులమైతే మాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక బెనిఫిట్స్ సులభంగానే అందుతాయి. -ఆదిలక్ష్మి, కండక్టర్, ఖమ్మం డిపో
చాలా సంతోషంగా ఉంది
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనానికి క్యాబినెట్ తీర్మానం చేయడం సంతోషించదగ్గ విషయం. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నందుకు ధన్యవాదాలు. విధివిధానాలు కూడా ప్రకటించి మాకు రావాల్సిన బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలి. గతంలో ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయం ఏ ప్రభుత్వం తీసుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. – వైఎన్ రావు, ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకుడు
సీఎం కేసీఆర్‌తోనే నెరవేరింది
ఎన్నో ఏళ్ల ఆర్టీసీ కార్మికుల కల సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైంది. అన్ని వర్గాల ప్రజలకు సమ న్యాయం బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగింది. ఇప్పటి వరకు కార్పొరేషన్ ఉద్యోగులుగా తక్కువ జీతాలకు పనిచేసిన మేము ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారడం సంతోషంగా ఉంది. ఆర్టీసీలోని అన్ని యూనియన్లు కూడా సంతోషకర వార్తతో యూనియన్లకు అతీతంగా అభినందనలు తెలుపుకుంటున్నారు. ఎవరికీ సాధ్యంకాని పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే. జై కేసీఆర్.. జైజై కేసీఆర్.
– అల్లం నాగేశ్వరరావు, తెలంగాణ మజ్దూర్ యూనియన్ మాజీ జిల్లా అధ్యక్షుడు, భద్రాచలం
ప్రభుత్వంలో విలీనం సంతోషదాయకం..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసుకొని ఆ సంస్థ ఉద్యోగులుగా ఉన్న మమ్ములను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తుండడం ఎంతో సంతోషదాయకం. ఉమ్మడి పాలనలో అనేక అవమానాలు పడ్డాం. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో ఎన్నో త్యాగాలు చేశాం. తెలంగాణ సిద్ధించాక ఇప్పుడు మాకు తగిన గుర్తించి లభించింది. మమ్ములను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తుండడం ఎంతో సంతోషకరమైన విషయం. మా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు రుణపడి ఉంటాం. -యాన్నమాల నాగేశ్వరరావు, కండక్టర్, ఖమ్మం
సీఎంకు రుణపడి ఉంటాం
సీఎం కేసీఆర్ సార్‌కు ఆర్టీసీ ఉద్యోగులంతా రుణపడి ఉంటారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలకపాత్ర పోషించారు. ఆ ఉద్యమ బహుమతిగా సీఎం కేసీఆర్ ఆర్టీసీని విలీనం చేస్తామని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం. ఇది నిజంగా హర్షించదగ్గ విషయం. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేసి ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాలి. సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. – రమేశ్, ఆర్టీసీ ఉద్యోగి
సీఎం కేసీఆర్‌కు వెరీ వెరీ థ్యాంక్స్..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేలా సీఎం కేసీఆర్ క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. జిల్లాకు చెందిన పువ్వాడ అజయ్‌కుమార్ రవాణా శాఖ మంత్రిగా ఉండడం మా అదృష్టం. ఆయన హయాంలో మేము ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతున్నాం. మమ్మల్ని అక్కున చేర్చుకొని ప్రభుత్వంలో కలుపుకొంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం.
-కిన్నెర ఆనందరావు, కండక్టర్, ఖమ్మం