మధిర, ఏప్రిల్ 25: తెలంగాణను దేశానికే దిక్సూచిగా చేసిన మహోన్నతమైన వ్యక్తి కేసీఆర్ అని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. అందుకే దేశ ప్రజలు ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. మంగళవారం మధిర నియోజకవర్గస్థాయి ప్రతినిధుల ఆత్మీయ సమ్మేళన సభ మధిరలో జిల్లా పరిషత్ చైర్మన్, మధిర బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి లింగాల కమల్రాజు అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ తొమ్మిదేళ్లపాటు సీఎం కేసీఆర్ రాష్ర్టాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారని అన్నారు.
కేసీఆర్ పాలన కావాలని దేశ ప్రజలు కోరుకుంటుంటే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. కొంతమంది బీజేపీ నాయకులు వ్యక్తిగత దూషణలకు దిగుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మధిరలో గులాబీ జెండా ఎగురడానికి ఎంతోకాలం పట్టదన్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో స్వల్పకాలంలో తెలంగాణలో సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని అబాసుపాలు చేస్తూ బీజేపీ ప్రభుత్వం పరిపాలన చేస్తున్నదని విమర్శించారు.
దేశాన్ని పాలించే హక్కు ప్రధాని మోదీకి లేదని, దేశ ప్రజలు ఆయన నాయకత్వాన్ని తిరస్కరిస్తున్నారని స్పష్టం చేశారు. జడ్పీ చైర్మన్ కమల్రాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్లో చేరిన వారికే ప్రభుత్వ పథకాలు మంజూరు చేస్తానంటూ స్థానిక ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పార్టీలకతీతంగా అర్హులందరికీ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయని గుర్తుచేశారు. బీఆర్ఎస్ నాయకుడు బొమ్మెర రామ్మూర్తి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నాయకులు, కార్యకర్తలు కలిసిమెలిసి పని చేయాలని, పార్టీ అభివృద్ధి కోసం ఒకేతాటిపై నడవాలని కోరారు. ఈ సభలో పలువురు నేతలు అభివృద్ధి కార్యక్రమాలపై తీర్మానాలు ప్రతిపాదించగా ముఖ్య నాయకులు బలపరిచారు.
బీఆర్ఎస్ నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులు మొండితోక లత, మెండెం లలిత, దేవరకొండ శిరీష, పూర్ణయ్య, రామారావు, చిత్తారు నాగేశ్వరరావు, చావా రామకృష్ణ, పసుపులేటి, చేబ్రోలు మల్లికార్జునరావు, రావూరి శ్రీనివాసరావు, పెంట్యాల పుల్లయ్య, వాకా లక్ష్మారెడ్డి, పంబి సాంబశివరావు, అరిగె శ్రీనివాసరావు, పల్లబోతుల వెంకటేశ్వరరావు, మంకెన రమేశ్, బంధం శ్రీనివాసరావు, తమ్మారపు బ్రహ్మయ్య, చావా వేణు, తిరుపతి కిశోర్, రంగిశెట్టి కోటేశ్వరరావు, వేమూరి ప్రసాద్, మీగడ శ్రీనివాసరావు, శ్రీనివాసరెడ్డి, బంకా మల్లయ్య, మల్లాది వాసు, శీలం విద్యాలత వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.