దుమ్ముగూడెం, ఆగస్టు 30 : విద్యార్థులు పాఠ్యాంశాల్లో ప్రాథమిక అంశాలు నేర్చుకునేందుకు, ఉపాధ్యాయులు బోధనా పద్ధతుల్లో వినియోగించేందుకు టీఎల్ఎం(టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్) మేళాలు ఎంతో ఉపయోగపడతాయని, టీచర్ల ప్రతిభకు దిక్సూచిలా పని చేస్తాయని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. రేగుబల్లి-2 గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన టీఎల్ఎం మేళాను ఆయన ప్రారంభించారు. ఉపాధ్యాయులు వివిధ రకాల ఆకృతులతో తయారు చేసిన చిత్రాలను పరిశీలించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీవో పాల్గొని మాట్లాడారు.
భద్రాచలం డివిజన్ పరిధిలోని 81 పాఠశాలల్లో పని చేస్తున్న 101 మంది టీచర్లు వివిధ రకాల ఆకృతులతో తెలుగు, గణితం, ఇంగ్లిష్‌కు సంబంధించిన చిత్రాలు విద్యార్థులు సులభమైన పద్ధతిలో అర్థం చేసుకునేలా రూపొందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి మేళాలు ఉపాధ్యాయుల్లో దాగి ఉన్న ప్రతిభా పాటవాలను వెలికితీయడమే కాకుండా సరికొత్త అంశాలు విద్యార్థులకు తెలిపేలా ప్రయోజనం చేకూరుతుందన్నారు.
ప్రస్తుతం మూడు డివిజన్లలో ఇలాంటి మేళాలు నిర్వహిస్తున్నామని, సృజనాత్మక చిత్రాలను వచ్చే నెల 9న ఐటీడీఏ స్థాయిలో టీఎల్ఎం మేళా నిర్వహించి ఉత్తమ చిత్రాలను ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏపీవో జనరల్ డేవిడ్‌రాజ్, డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి మణెమ్మ, ఏసీఎంవో రమేశ్, ఏటీడీవో అశోక్‌కుమార్, హెచ్ఎం సావిత్రి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.