కొత్తగూడెం ఎడ్యుకేషన్, మార్చి 22 : ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రైవేటు విద్యకు దీటుగా నిలిపేందుకు సీఎం కేసీఆర్ వివిధ రకాల పథకాలను ప్రవేశపెడుతున్నారు. అందులో భాగంగా వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టాలని గతంలోనే నిర్ణయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ప్రాథమిక పాఠశాల టీచర్లు ముగ్గురిని, ఉన్నత పాఠశాలల టీచర్లు 8మందిని ఎంపిక చేసి ఈ నెలలో శిక్షణ అందించారు. ఈ శిక్షణ హైదరాబాద్లో నిర్వహించగా.. ఉపాధ్యాయులకు ప్రముఖ అజీజ్ ప్రేమ్జీ యూనివర్సిటీ వారు తోడ్పాటునందించారు. శిక్షణ పొందిన ప్రాథమిక టీచర్లు ముగ్గురు 49మందికి, శిక్షణ పొందిన ఉన్నత టీచర్లు 8మంది 51మందికి ఈ నెల 14నుంచి 18వ తేదీ వరకు శిక్షణ అందించారు.
అంతకుముందు శిక్షణ పొందిన 49మంది టీచర్లు జిల్లాలోని 1,900మంది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు 9వారాల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. అదేవిధంగా శిక్షణ పొందిన 51మంది ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు 838 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. మొదటివారం ప్రత్యక్ష శిక్షణ, 8 వారాల పాటు ఆన్లైన్ శిక్షణ ఉంటుంది. దీనికోసం మూడు బ్యాచ్లను ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 32 సెంటర్లలో ఈ శిక్షణ ఇప్పటికే ప్రారంభం కాగా మే 10వ తేదీ వరకు పూర్తి చేయనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో విద్యావ్యవస్థలో పెనుమార్పులు రానున్నాయి. ఒకవైపు మన ఊరు – మన బడి, మరోవైపు ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టడంతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షితులవుతున్నారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన కోసం ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి మరీ ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి ప్రారంభించడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకుపోతున్నారు. దీనికోసం ఉపాధ్యాయులను సన్నద్ధం చేస్తున్నారు.