కారేపల్లి, డిసెంబర్ 31 : ఉత్తమ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీఆర్ఓ దూదిపాళ్ల విజయ్ కుమార్ అన్నారు. కారేపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో బుధవారం నిర్వహించిన సైన్స్ టీచర్ భీమవరపు కమల ఉద్యోగ విరమణ సన్మానోత్సవ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కొత్త కమలాపురం ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక విద్యను అందించిన కమల టీచర్ తనతో పాటు గ్రామంలో ఎంతోమంది ఉన్నత స్థితికి చేరడానికి దోహద పడ్డారని కొనియాడారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు జ్ఞానాన్ని, నైపుణ్యాలను నేర్పించి వారిని సరైన మార్గంలో నడిపించే మార్గదర్శకులన్నారు. విద్యార్థుల భవిష్యత్‌కు సరైన దిశా నిర్దేశం చేస్తూ ఎందరినో తీర్చిదిద్ది వారి జీవితాల్లో వెలుగులు నింపగల శక్తివంతులు ఉపాధ్యాయులే అన్నారు.
అనంతరం కమల శ్రీనివాసరావు దంపతులను ఆయన శాలువాతో సన్మానించారు. ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, బంధువులు, విద్యార్థులు కమల శ్రీనివాసరావు దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కారేపల్లి సర్పంచ్ మేదరి వీరప్రతాప్, సింగరేణి కాలరీస్ డీజీఎం హరి ప్రసాద్, హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు శ్యామ్, కాంగ్రెస్ నాయకుడు ఇమ్మడి తిరుపతిరావు, రిటైర్డ్ ఎంఈఓలు నున్న అప్పారావు, యేసుదాసు, రిటైర్డ్ ఉపాధ్యాయులు గాలి రంగారావు, ఎండీ బాబు, చెవుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Karepally : సమాజ నిర్మాణంలో టీచర్లది కీలక పాత్ర : దూదిపాళ్ల విజయ్