ఖమ్మం అర్బన్, మే 31 : ఎన్నో సంవత్సరాలు వేడుకున్నారు.. మరెన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చారు.. కాళ్లరిగేలా తిరిగారు.. తమ బాధలను ఎలా చెప్పాలో అలా వ్యక్తపరిచారు. ఏంచేసినా ఆంధ్రా పాలకులు కనికరం చూపలేదు కదా కనీసం స్పందించలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. వారికి మాట ఇచ్చిన ప్రకారం వెనువెంటనే అమల్లోకి తెచ్చింది.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేసే ఒప్పంద అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తూ 2023 మేలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోద ముద్రవేశారు. ఆయా అధ్యాపకుల కుటుంబాల్లో నూతన వెలుగులు వచ్చాయి.. తమకు ఏ సమస్యలు లేవని ఆనందంగా ఉంటున్న అధ్యాపకుల జీవితాలపై మళ్లీ నీలినీడలు కమ్ముకున్నాయి. కాంగ్రెస్ సర్కార్‌లో అధ్యాపకులకు సహజంగా రావాల్సిన ఇంక్రిమెంట్లు విషయంలో విషం గక్కుతూ కుట్రలు పన్నుతున్నారు. ఫలితంగా అధ్యాపకులు రోడ్డెక్కాల్సిన పరిస్థితులు దాపురించాయి.
కళాశాలల్లో ఒప్పంద పద్ధతిలో అధ్యాపకులుగా పనిచేసే వారిని రెగ్యులరైజ్ చేశారు గత ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు వారు న్యాయపరమైన డిమాండ్‌తో జీతాలు పెంచండి మహాప్రభో అంటూ వేడుకున్నారు. ఏ ఒక్కరు స్పందించలేదు. కానీ తెలంగాణ రాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వారి సమస్యలు తెలుసుకుని వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేశారు.
తొలుత రూ.18 వేలతో పనిచేస్తున్న వారిని రూ.27 వేలకు 50శాతం వేతనాన్ని పెంచారు. తర్వాత రూ.37,100లకు వేతనాలను పెంచారు. తర్వాత సమస్య ఉండొద్దని కేసీఆర్ పెద్ద మనసుతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో పనిచేసే వారు సమస్యలు తొలగి సంతృప్తిగా ఉంటేనే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించగలరని వారిని రెగ్యులరైజ్ చేశారు.
రెగ్యులరైజ్ అయిన దగ్గర నుంచి ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉంటున్న వారి జీవితాల్లోకి మళ్లీ అలజడి మొదలైంది. 2023 మే 3న జిల్లాలో 132మంది అధ్యాపకులను క్రమబద్ధీకరించారు. వీరందరూ రెండో ఇంక్రిమెంట్ తీసుకోవాల్సి ఉండగా కొందరు కుట్రలు పన్ని ఇంక్రిమెంట్లు రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా అధ్యాపకులు ఉలిక్కిపడ్డారు. సహజంగా రావాల్సిన ఇంక్రిమెంట్లను కూడా రాకుండా కాంగ్రెస్ సర్కార్‌లో అడ్డుకుంటున్నారని అధ్యాపకులు ఆరోపిస్తున్నారు.
వార్షిక ఇంక్రిమెంట్లో జిల్లాలో కొందరు ప్రిన్సిపాల్స్ మంజూరు చేయలేదు. మరికొందరు ప్రిన్సిపాల్స్ మంజూరు చేసిన జిల్లా ఖజానాలో ఆమోదించకుండా అధ్యాపకుల ఇంక్రిమెంట్లతో ఆటలు ఆడుకుంటున్నారు. కొంతమంది వ్యక్తులు దురుద్దేశంతో కుట్రపూరితంగా వాట్సాప్ మెసేజ్‌లతో నూతన అధ్యాపకులకు రావాల్సిన రెండో ఇంక్రిమెంట్ వేయకుండా కుట్రలు పన్నారని అధ్యాపకులు ఆరోపిస్తున్నారు.
శనివారం ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ జరుగుతున్న సెంటర్లో నల్ల బ్యాడ్జీలు, నల్లచొక్కాలతో అధ్యాపకులు నిరసన తెలిపారు. ఆదివారం సైతం సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపడతామని హెచ్చరించారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి అధ్యాపకులు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఏపీ సబార్డినేట్ సర్వీస్ 1996, రూల్ నెంబర్ 18 ప్రకారం రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి వార్షిక ఇంక్రిమెంట్, ప్రొబెషనరీ డిక్లరేషన్ చేపట్టాల్సిన బాధ్యత యజమానిది. ఇంటర్ విద్యాశాఖాధికారి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. నూతన అధ్యాపకులకు ఇంక్రిమెంట్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పించాలి.
– డాక్టర్ కొప్పిశెట్టి సురేష్, టీజీజేఎల్‌ఏ 475 స్టేట్ ప్రధాన కార్యదర్శి
2023లో రెగ్యులర్కాబడిన నూతన అధ్యాపకులకు రెండో వార్షిక ఇంక్రిమెంట్ ఆపడం అన్యాయం. కొందరు ప్రిన్సిపాల్స్ ఖజానా అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారు. కొద్దిమంది ప్రిన్సిపాల్స్ ఇంక్రిమెంట్ చేసినప్పటికీ ఖజానా అధికారులు ఎలాంటి కారణం లేకుండా రిజెక్ట్ చేశారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
– గుమ్మడి మల్లయ్య, టీజీజేఎల్‌ఏ 475 జిల్లా అధ్యక్షుడు