మామిళ్లగూడెం, జూలై 6 : రాష్ట్రవ్యాప్తంగా వన మహోత్సవం కార్యక్రమాన్ని పండుగలా చేపడుతున్నట్లు రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య సంరక్షణాధికారి ప్రియాంక వర్గీస్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌తో కలిసి వన మహోత్సవంపై అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతిసారి ఖమ్మం జిల్లా ప్రథమ స్థానంలో నిలుస్తోందన్నారు. జిల్లాకు 31.06 లక్షల మొకలు నాటడాన్ని లక్ష్యంగా నిర్దేశించామని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలన్నారు. మొకల ప్రాధాన్యతపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలన్నారు.
జిల్లా రోడ్ మ్యాప్‌ను అనుసరించి మొక్కలు లేని ప్రాంతాల్లో విరివిగా నాటాలన్నారు. ముఖ్యంగా సింగరేణి స్థలాల్లో పచ్చదనం పెరిగేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని వివిధ శాఖల ద్వారా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అటవీ శాఖ ద్వారా 7.60 లక్షలు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ 10 లక్షలు, నీటిపారుదల శాఖ 1.06 లక్షలు, వ్యవసాయ శాఖ 2.70 లక్షలు, ఉద్యానవన, పట్టుపరిశ్రమల శాఖ ద్వారా 1.80 లక్షలు, ఎక్సైజ్ శాఖ 60 వేలు, మున్సిపాలిటీల ద్వారా 4.78 లక్షలు, విద్యా శాఖ 30 వేలు, పరిశ్రమల శాఖ 30 వేలు, గనుల శాఖ 60 వేలు, విద్యుత్, సింగరేణి సంస్థల ద్వారా 1.32 లక్షల మొకలు నాటడానికి ప్రణాళిక చేసినట్లు వివరించారు. స్థలాల ఎంపిక జాగ్రత్తగా చేయాలని, నాటడమే కాక వాటి నిర్వహణ, సంరక్షణకు అనువుగా ఉండేట్లు చూడాలన్నారు.
జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్‌సింగ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 2015 నుంచి మొకలు నాటే కార్యక్రమం చేపట్టి, గత ఏడాది వరకు 14.87 కోట్ల మొకలు నాటినట్లు తెలిపారు. చనిపోయిన మొకల స్థానంలో కొత్త మొకలు నాటాలన్నారు. అవెన్యూ ప్లాంటేషన్‌కి ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలన్నారు. సైట్, లొకేషన్, నర్సరీలవారీగా కార్యక్రమం పూర్తికి టై అప్ చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్, డీఆర్డీవో సన్యాసయ్య, జడ్పీ సీఈవో ఎస్.వినోద్, డీపీవో హరికిషన్, డీఈవో సోమశేఖర శర్మ, డీఐఈవో రవిబాబు, జిల్లా పరిశ్రమల అధికారి అజయ్‌కుమార్, అటవీ అభివృద్ధి అధికారి మంజుల, నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ సంపత్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సరిత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.