ఖమ్మం కమాన్‌బజార్, డిసెంబర్ 8: రైతుబంధు కింద ఏడాదికి ఎకరానికి రూ.15 వేలు వస్తాయని రైతులు ఓటు వేస్తే ఉన్న రూ.10 వేలూ పోయాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉచిత బస్సు తప్ప మిగిలిన ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు కాలేదని విమర్శించారు. ఖమ్మం నగరంలో ఆదివారం నిర్వహించిన సీపీఎం ఖమ్మం డివిజన్ కమిటీ మహాసభలో ఆయన మాట్లాడారు.
రైతుల పంటల సాగుకు పెట్టుబడిని అందించే రైతుభరోసా పథకాన్ని ఏడాది కాలంగా అమలు చేయడం లేదని విమర్శించారు. వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ.12 వేలు, మహిళలకు నెలకు రూ.2,500 వంటి అనేక హామీలు అమలుకు నోచుకోవడం లేదని ధ్వజమెత్తారు. 3 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇస్తామన్న కాంగ్రెస్ హమీ.. హామీగానే మిగిలిపోయిందని దుయ్యబట్టారు. కొడంగల్‌లో ఫార్మాసిటీ పేరుతో మూడు వేల ఎకరాల గిరిజన భూములను బలవంతంగా లాక్కునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. అనంతరం పార్టీ డివిజన్ కార్యదర్శిగా వై.విక్రమ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహాసభలో పార్టీ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, ఎర్రా శ్రీకాంత్, మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ, కల్యాణం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.