భద్రాచలం, డిసెంబర్ 28 : అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రజా పాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. గురువారం పట్టణంలోని తహసీల్దార్, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో తెలిపిన విధంగా వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేయాలన్నారు. వంటింటి గ్యాస్ రూ. 500లకే ఇస్తామని చెప్పిన విధంగా అర్హులైన ప్రతి కుటుంబానికి అందజేయాలన్నారు.
ఇళ్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రూ.5 లక్షలు అందజేయాలని, ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణలో ముందుగా వృద్ధులు, దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆసరా పింఛన్ పొందుతున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే తెలిపారు. పెన్షన్‌కు అర్హులైన కొత్త వారు మాత్రమే చేయూత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మాలోత్ మంగీలాల్, తహసీల్దార్ శ్రీనివాస్, ప్రత్యేక అధికారి బీ.నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.