ఇల్లెందు/ ఇల్లెందు రూరల్, సెప్టెంబర్ 11: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రంలో ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి చరిత్ర సృష్టించారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. ఇందులో వంద సీట్లు గెలుస్తామని, మూడో దఫా కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని స్పష్టం చేశారు. ఇల్లెందులో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ రోడ్ షోలో ఆయన మాట్లాడారు. పార్టీ అధినేత కేసీఆర్ ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గాలకు తనను ఇన్చార్జిగా నియమించారని, ఆయన అప్పగించిన బాధ్యతను అక్షరాలా నెరవేరుస్తామని అన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో ఇల్లెందు నియోజకవర్గంలో సుమారు రూ.1,600 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని అన్నారు. దశాబ్దాల పోడు భూముల సమస్యకు సీఎం కేసీఆరే పరిష్కారం చూపారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే హరిప్రియ మరోసారి కూడా విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. అధికారంలో లేని రాష్ర్టాలను దెబ్బతీయాలనే దురుద్దేశంతోనే కేంద్రం జమిలి ఎన్నికలు తీసుకురావాలని చూస్తోందని విమర్శించారు. కానీ ముఖ్యమంత్రి ఆగస్టులోనే సీఎం కేసీఆర్ ఎన్నికల యుద్ధానికి దిగారని గుర్తుచేశారు. కొన్ని పార్టీలకు ఈ నియోజకవర్గంలో అభ్యర్థులే లేరని విమర్శించారు. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ 10కి 10 సీట్లూ గెలుచుకుంటుందని స్పష్టం చేశారు.
అభివృద్ధి చేశా.. ఆశీర్వదించండి: హరిప్రియ
ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంలో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే హరిప్రియ పేర్కొన్నారు. తాను చేసిన అభివృద్ధిని గమనించి రానున్న ఎన్నికల్లో తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు.
ఎస్సీ, ఎస్టీలు ఇంకా ఓటు బ్యాంకులేనా..: ఎంపీ కవిత
కాంగ్రెస్, బీజేపీలు ఎస్సీ, ఎస్టీలను ఓటు బ్యాంకులుగానే చూస్తున్నాయని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత విమర్శించారు. తండాలను పంచాయతీలుగా చేసి గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు.
రవిచంద్రకు ఘన స్వాగతం..
ఎన్నికల ఇన్చార్జిగా మొదటిసారి ఇల్లెందుకు వచ్చిన ఎంపీ వద్దిరాజుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికాయి. ఎంపీలు వద్దిరాజు, కవిత, ఎమ్మెల్యే హరిప్రియ కలిసి తొలుత ఆంజనేయస్వామి గుడి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 200 కార్లు, 1100 బైకులు, 70 ఆటోలతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు దిండిగాల రాజేందర్, బానోత్ హరిసింగ్, నాదెండ్ల శ్రీనివాస్, పరుచూరి వెంకటేశ్వర్లు, శీలం రమేశ్, ప్రసాద్, హన్మంతరావు, లక్ష్మణ్, గణేశ్, ఉమాదేవి, జానీ, పానుగంటి రాధ, గంగుల సత్యనారాయణ, గిన్నారపు రాజేశ్, జేకే శ్రీను, మేకల శ్యాం తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధింగా ఉన్నారు..
రాష్ట్రంలో సంపదను పెంచిన ఘనత, వాటి ఫలాలను ప్రజలకు పంచిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని ఎంపీ వద్దిరాజు పేర్కొన్నారు. అందుకే ఎన్నికలు ఎప్పుడు వచ్చిన బీఆర్ఎస్ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇల్లెందులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హరిప్రియ చేసిన అభివృద్ధిని గమనించిన సీఎం కేసీఆర్.. మళ్లీ ఆమెకే అవకాశం కల్పించారని అన్నారు. అందుకని అందరమూ సమష్టిగా పనిచేసి ఆమె విజయాన్ని సీఎంకు కానుకగా ఇద్దామని అన్నారు. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, ఇతర ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.