– సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు సిద్దినేని కర్ణ కుమార్
ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 24 : పార్టీ ఫిరాయింపుల అంశంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజకీయ పార్టీలకు గుణపాఠంగా నిలుస్తుందని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు సిద్దినేని కర్ణ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ అనంతరం కాంగ్రెస్ లోకి పార్టీ ఫిరాయించిన వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన అనర్హత తీర్పును సమర్థించారు. దీనిపై అత్యున్నతమైన న్యాయస్థానానికి దానం నాగేందర్ వెళ్లినప్పటికీ అక్కడ కూడా ప్రజాస్వామ్య బద్ధమైన తీర్పురావడం హర్షించదగిన విషయంగా అభివర్ణించారు. కావున పార్టీ మార్పులు, ప్రజాప్రతినిధుల అనర్హతకు సంబంధించిన రాజ్యాంగ నిబంధనలను రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు గౌరవించాలని ఆయన పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు ఈ తీర్పు ఒక హెచ్చరికగా భావించాలన్నారు. ప్రజల తీర్పుతో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు పార్టీ మార్పుల విషయంలో రాజ్యాంగబద్ధమైన నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.