వేములాడ ఆలయంపై ఏది నిజం?
వేములాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులపై వివాదం రోజురోజుకూ ముదురుతున్నది. ప్రధాన ఆలయ విమాన గోపురం (శిఖరం) తొలగింపు వ్యవహారంపై దేవాదాయశాఖ, ప్రభుత్వ విప్, అర్చక బృందం ఇస్తున్న వివరణలు కొత్త సందేహాలకు తావిస్తున్నాయి.
- గోపుర తొలగింపుపై 3 రకాల ప్రకటనలు
- శృంగేరి అనుమతుల నుంచి శిఖరం తొలగింపు వరకు ఎన్నో సందేహాలు
- ఆగస్టు 12న అనుమతి అంటూ ప్రకటన
- 13న శృంగేరికి అధికారుల బృందం
- వెలుగులోకి తెచ్చిన ‘నమస్తే’పై అక్కసు
కరీంనగర్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వేములాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులపై వివాదం రోజురోజుకూ ముదురుతున్నది. ప్రధాన ఆలయ విమాన గోపురం (శిఖరం) తొలగింపు వ్యవహారంపై దేవాదాయశాఖ, ప్రభుత్వ విప్, అర్చక బృందం ఇస్తున్న వివరణలు కొత్త సందేహాలకు తావిస్తున్నాయి. వారి మాటల మధ్య పొంతన కుదరడం లేదు. ఆగస్టు 12న శృంగేరి పీఠం అనుమతిచ్చిందని దేవాదాయశాఖ చెప్తుంటే.. అధికారుల బృందం ఆగస్టు 13న పీఠాన్ని సందర్శించినట్టు స్థానాచార్యులు వెల్లడించారు. నవంబర్ 1న కళాపకర్షణ నిర్వహించామని ఒకవైపు చెబుతూ.. నవంబర్ 16న కలశానికి ధాన్యాధివాసం చేసినట్టు మరో ప్రకటనలో పేర్కొన్నారు. పాత శిఖరాన్ని ఎప్పుడు తొలగించారు? శృంగేరిపీఠం అనుమతుల్లో ఏముంది? గర్భాలయానికి నష్టం కలుగదన్న హామీకి సాం కేతిక ఆధారాలేమిటి? ప్రాచీన కట్టడాల పరిరప్రశ్నలకు సమాధానాలు రావడం లేదు. వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న ‘నమస్తే తెలంగాణ’ కథనాలపై అక్కసు వెళ్లగక్కడం మినహా భక్తుల సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం కనిపించడం లేదు.
దేవాదాయశాఖ ఇచ్చిన వివరణలో చూస్తే.. నూతన పంచతల విమాన గోపుర నిర్మాణానికి సంబంధించి శృంగేరి పీఠాధిపతులను సంప్రదించామని, ఆగస్టు 12న నూతన పంచతల విమాన గోపుర నిర్మాణానికి అనుమతి ఇచ్చారని చెప్పారు. కానీ, శుక్రవారం స్థానాచార్యులు వెల్లడించిన వివరాలను చూస్తే.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, ఓఎస్డీ శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగర్వాల్, ఈవో రమాదేవి, అర్చకులతో కూడిన బృందం ఆగస్టు 13న శృంగేరి పీఠానికి వెళ్లినట్టు తెలిపారు. విమాన గోపురాన్ని నలుదిక్కులా భక్తులకు కనిపించేలా శ్రేష్ఠమైన రాతితో నిర్మించాలని స్వామీజీ అనుమతిచ్చినట్టు వివరించారు. అధికారుల బృందం ఆగస్టు 13న శృంగేరికి వెళ్లి చర్చలు జరిపితే, అంతకుముందు రోజే అంటే ఆగస్టు 12న అనుమతి ఎలా లభించింది? ఆగస్టు 12న అనుమతి ఇస్తే.. ఆ అనుమతి కోసం ఎవరు శృంగేరి పీఠాన్ని సంప్రదించారో స్పష్టత లేదు.
దేవాదాయశాఖ ఇచ్చిన వివరాల ప్రకారం చూస్తే.. ప్రధాన అర్చకులు, ఇన్చార్జి స్థానాచార్యుల నిర్ణయించిన ముహూర్తంలోనే కళాపకర్షణ నిర్వహించినట్లు తెలిపింది. అర్చకులు, స్థానాచార్యుల సంప్రదింపులతోనే పనులు జరుగుతున్నట్లు పేర్కొన్నది. అర్చక బృందం ప్రకటన ప్రకారం చూస్తే శృంగేరి పీఠం సూచనలు, సలహాలు, ఆశీస్సుల మేరకు పనులు జరుగుతున్నట్లు తెలిపింది. ఆది శ్రీనివాస్ ప్రకటన ప్రకారం చూస్తే ఎవరి వ్యక్తిగత నిర్ణయాలకు తావులేదని, శృంగేరి పీఠం సూచనలే మార్గదర్శకమని చెప్పారు. ఇక్కడ భక్తుల నుంచి అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఆలయంలో ఏండ్ల తరబడి పనిచేస్తున్న ప్రధాన అర్చకులు, స్థానాచార్యులతో అభివృద్ధి పనులపై ఎన్ని సమావేశాలు నిర్వహించారు? అర్చకులందరి అభిప్రాయాలను తీసుకున్నారా? సమావేశ మినిట్స్ ఉన్నాయా? శృంగేరి పీఠం సూచనలు, స్థానిక అర్చకుల అభిప్రాయాలు, ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగం ప్రతిపాదనలు.. వీటిలో ఏదైనా భిన్నాభిప్రాయం ఉంటే దాన్ని ఎలా పరిష్కరిస్తున్నారన్న దానిపై స్పష్టత కొరవడింది.
దేవాదాయశాఖ తెలిపిన వివరాలను చూస్తే నవంబర్ 1న ఆశ్వయుజ బహుళ సప్తమి, పునర్వసు నక్షత్రయుక్త శుభ ముహూర్తం లో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మధ్య కళాపకర్షణ, కలశ సంబంధిత పూజలు నిర్వహించినట్టు పేర్కొన్నది. పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరమే నిర్మాణ పనులు ప్రారంభించినట్లు తెలిపింది. స్థానాచార్యులు, అర్చక బృం దం కళాపకర్షణ నిర్వహించిన తదుపరి పనులు చేపట్టామని చెప్తున్నది. అర్చక బృందం కూడా శాస్ర్తోక్తంగా ధాన్యాధివాసం నిర్వహించి కలశాన్ని భద్రపరిచిన ట్టు పేర్కొన్నది. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. సప్తమినాడు పనులు జరిగితే అష్టమినాడు చేపట్టినట్టు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడ అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నవంబర్ 1న కళాపకర్షణ జరిగితే ఆ ఫొటోలు, వీడియోలు ఎందుకు విడుదల చేయలేదు? ఏయే పూజలు నిర్వహించారు? ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు ఎవరు పాల్గొన్నారు? నవంబర్ 1న నిర్వహించిన కళాపకర్షణ అనంతరం ఏ నిర్మాణ పనులు ప్రారంభించారు? నవంబర్ 1న జరిగిన కార్యక్రమం పాత విమాన గోపురం తొలగింపునకు సంబంధించినదా? కొత్త శిఖర నిర్మాణానికి సం బంధించినదా?
నవంబర్ 16న సోమవారం కార్తీక శుద్ధ సప్తమి, శ్రవణ నక్షత్ర యుక్త శుభ ముహూర్తంలో ప్రధాన ఆలయ శిఖరంపై ఉన్న కలశాన్ని గర్భాలయంలో ధాన్యాధివాసం చేసినట్టు పేర్కొంది. నిత్య కైంకర్యాలు యథావిధిగా కొనసాగుతున్నాయని వివరించింది. అర్చక బృందం ప్రకటనల ప్రకారం చూస్తే ప్రత్యేక శుభముహూర్తంలో గర్భాలయంలో ధాన్యాధివాసం నిర్వహించి శిఖర కలశాన్ని భద్రపరిచినట్లు తెలిపింది. గర్భాలయ పైభాగంలో శిలామయ శిఖర నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు పేర్కొంది. ఆది శ్రీనివాస్ ప్రకటన ప్రకారం చూస్తే.. శిఖరానికి సంబంధించిన కార్యక్రమాలు, కలశానికి ధాన్యాధివాసం, గర్భగుడిలో ప్రతిష్ఠ వంటి కార్యక్రమాలన్నీ ఆగమశాస్త్ర నియమాల ప్రకారమే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇక్కడ అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నవంబర్ 16న తొలగించింది శిఖరంపై ఉన్న కలశాన్ని మాత్రమేనా? పాత విమాన గోపురం తొలగింపు ఎప్పుడు ప్రారంభమైంది? శిఖరం తొలగింపు, కలశం తొలగింపు, కొత్త శిఖరం నిర్మాణం.. ఈ మూడింటి పూర్తి షెడ్యూల్ ఏమిటి? కలశాన్ని గర్భాలయంలో ధాన్యాధివాసం చేసినట్టు చెప్తున్నారు. మరి నూతన శిఖరంపై తిరిగి ప్రతిష్ఠించే తేదీ ఎప్పుడు?నవంబర్ 1న కళాపకర్షణ జరిగిందని, నవంబర్ 16న కలశానికి ధాన్యాధివాసం చేశామని చెప్తున్నారు. ఈ రెండు కార్యక్రమాల మధ్య జరిగిన పనుల వివరాలేమిటి?
భక్తుల నుంచి లెక్కకు మించిన అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో రాజన్న దేవాలయ పునర్నిర్మాణంలో జరుగుతున్న లోపాలను ఎత్తి చూపుతున్న నమస్తే తెలంగాణపై కొంతమంది అక్కసు కక్కుతున్నారు. తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ.. సోషల్ మీడియాలో ట్రోల్ చేయిస్తున్నారు. అధికారులు, దేవాదాయ సిబ్బంది, అర్చకులపై ఒత్తిడి తెచ్చి ప్రకటనలు, ప్రెస్మీట్లు పెట్టిస్తున్నారు. అధికారుల నుంచి అర్చకుల వరకు అందరికి లోపాలు తెలుసు. కానీ, పెద్దలకు భయపడి ముందుకు రావడం లేదు. ఇప్పటికైనా సర్కార్ ‘నమస్తే తెలంగాణ’పై అక్కసు కక్కడం మానేసి, లోపాలను గుర్తించి భక్తుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసి నిర్మాణాలను చేయాల్సిన అవసరం ఉన్నది.
గర్భాలయానికి ఎలాంటి నష్టం కలుగదంటున్నారు.. అదే సమయంలో శిఖరాన్ని తొలగించి తిరిగి నిర్మిస్తున్నారు! అర్చక బృందం వెల్లడించిన వివరాల ప్రకారం.. చూస్తే మూలవిరాట్టు కొలువైన ప్రాచీన గర్భాలయానికి ఎలాంటి హాని కలగకుండా శిఖరాన్ని మరింత ఎత్తుగా నిర్మిస్తున్నట్టు పేర్కొన్నది. గర్భాలయ పునాదులు, నిర్మాణ పటిష్టతను సాంకేతిక నిపుణులు పరిశీలించి అనుకూలంగా ఉందని నిర్ధారించిన తర్వాతే పనులు ప్రారంభించినట్టు తెలిపింది. ఆది శ్రీనివాస్ మాటల్లో చూస్తే.. గతంలో శిలామయంగా ఉన్న శిఖరాన్ని 1970 దశకంలో తొలగించి ఇటుకలతో నిర్మించినట్టు చర్చల్లో వెల్లడైందని చెప్తున్నారు. ప్రస్తుతం తిరిగి శిలామయంగా నిర్మిస్తున్నట్టు వివరించారు. గర్భాలయానికి ఎలాంటి హాని కలుగదని చెప్తున్నప్పుడు, పాత శిఖరాన్ని తొలగించి కొత్తది నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చింది? గర్భాలయ నిర్మాణ పటిష్టతను పరిశీలించిన సాంకేతిక నిపుణులు ఎవరు? వారు ఇచ్చిన నివేదికను ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉంచడం లేదు? పాత శిఖరాన్ని తొలగించడానికి ముందు, తర్వాత గర్భాలయానికి సంబంధించిన నిర్మాణ పరిస్థితిని నమోదు చేశారా? గర్భాలయానికి నష్టం లేదనే హామీకి సాంకేతిక ఆధారాలు ఏమిటీ? అన్నదానికి సమాధానాలు మాత్రం లేవు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

