ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులకు అందని ద్రాక్షలా మారింది. మొకజొన్న కొనుగోలు కేంద్రాల్లో మార్ఫెడ్ ద్వారా క్వింటాకు రూ.2,410 చెల్లిస్తున్నామని పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు దానికి విరుద్ధంగా ఉన్నాయి. గన్నీబ్యాగుల కొరత, రవాణా చార్జీలు, అదనపు తూకం వంటి సాకులతో రైతులకు క్వింటాకు దాదాపు రూ.300 నుంచి 400 వరకు కోత పడుతోంది. అన్ని ఖర్చులు పోను తమ చేతికి క్వింటాకు కేవలం రూ.2,050 మాత్రమే అందుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-మధిర, మే 5
ప్రభుత్వం మార్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలకు ఉచితంగా గన్నీ బ్యాగులు సరఫరా చేయాల్సి ఉండగా, కాంట్రాక్టర్ల దోపిడీ వల్ల రైతులు సొంతంగా బయట మారెట్లో ఒకో బస్తాను రూ.25 పెట్టి కొనుగోలు చేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం కాంట్రాక్టర్కు బస్తాకు రూ.26 చొప్పున చెల్లిస్తున్నా, అవి రైతులకు చేరడం లేదు. సొంతంగా కొన్న బస్తాలకు డబ్బులు అడిగితే అధికారులు సంబంధం లేదన్నట్లు వ్యవహరించడం గమనార్హం.
రెండు కిలోలు అదనం..
నిబంధనల ప్రకారం ఒక బస్తాలో 50 కిలోల మొకజొన్నలు మాత్రమే ఉండాలి. కానీ, కొనుగోలు కేంద్రాల్లో మాత్రం బస్తాకు 51 కిలోల చొప్పున క్వింటాకు రెండు కిలోల తూకం అదనంగా వేస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే.. బస్తాలు మీరే తెచ్చుకోవాలి, తూకం ఇలాగే ఉంటుందంటూ రైతులతో వాదిస్తున్నారు.
రవాణా, దిగుమతి పేరుతో..
ప్రభుత్వం ఇచ్చే కిరాయి సరిపోవడం లేదంటూ లారీ యజమానులు అదనపు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వర్షం భయంతో రైతులు ఒకో బస్తాకు రూ.50 చొప్పున అదనంగా లారీ డ్రైవర్లకు చెల్లిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద కాంటా సమయంలో హమాలీలకు గోడౌన్ల వద్ద దిగుమతికి, ఎగుమతికి కలిపి ఒకో బస్తాకు వంద రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మద్దతు ధర పేరుతో రైతుకు జరుగుతున్న నష్టాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అదనపు తూకం, గన్నీ బ్యాగుల ఖర్చు, లారీ కిరాయిల పేరిట వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఖర్చులన్నీ రైతుపైనే వేస్తున్నారు..
యాసంగిలో 34 ఎకరాల్లో మొకజొన్న సాగు చేశాను. 1,200 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో సంతోషపడ్డాం. కానీ ఖర్చులన్నీ రైతులపైనే వేస్తున్నారు. లారీ కిరాయి, బస్తాల ఖర్చులు నేనే చెల్లించాను. ఒక్క లారీ రవాణాకు బస్తాకు రూ.50 చొప్పున లక్షన్నర ఖర్చు అయ్యింది. వీటితోపాటు బస్తాల కొనుగోలు, ఎగుమతి, దిగుమతి చార్జీలు కలుపుకొని లక్షా యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టాను. కొనుగోలు కేంద్రాల వద్ద కూడా రైతులకు న్యాయం జరగటం లేదు.
-కొమ్మినేని ఉపేందర్, రైతు, రావినూతల, బోనకల్లు