ఉచిత బస్సు పథకం మరో ఉసురు తీసినట్లయింది. 15 ఏళ్లుగా కలలుగన్న ఓ యువకుడు ఏడాది క్రితమే ఫైనాన్స్‌లో కొత్త ఆటోను కొన్నాడు. సరిగ్గా అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరిట ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. దీంతో రోడ్డున పడ్డ ఎందరో ఆటో డ్రైవర్లలో ఈ యువకుడు కూడా ఉన్నాడు. ఆటోను కొత్తగా కొనుగోలు చేసినప్పటికీ మహిళలెవరూ పెద్దగా ఆటో ఎక్కకపోవడం, ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న రూ.12 వేలు ఇవ్వకపోవడం, ఇటు రోజువారీ ఆదాయం కూడా సరిగా రాకపోవడం, కిస్తీలు కట్టేంత కిరాయిలూ లభించకపోవడం, వాటిని తీర్చేందుకు, కుటుంబ పోషణకు మరికొంత అప్పులు చేయాల్సి రావడం, చివరికి వాటిని తీర్చే మార్గం కూడా కన్పించకపోవడం వంటి కారణాలతో ఆ యువకుడు ఉరేసుకొని ఉసురు తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన భద్రాద్రి జిల్లా ఇల్లెందులో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
– ఇల్లెందు, జనవరి 19
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మహాలక్ష్మి పథకం ఆటో కార్మికుల బతుకులపై అంతులేని ప్రభావాన్ని చూపుతోందనేందుకు వరుసగా జరుగుతున్న ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. తాజాగా ఇల్లెందులో మరో ఆటో డ్రైవర్ ఉసురు తీసుకోవడం.. ఆ పథక పర్యవసానాలను తెలియజేస్తున్నాయి. స్థానికుల కథనం ప్రకారం.. ఇల్లెందు మున్సిపాలిటీ ఒకటో వార్డుకు చెందిన రెడ్డబోయిన సుమంత్‌ది (36) నిరుపేద కుటుంబం. ఆటో వృత్తిపై మమకారం పెంచుకున్న అతడు..
ఆటో డ్రైవింగ్ నేర్చుకున్నాడు. 15 ఏళ్లుగా అద్దె ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. ఎలాగైనా సొంతంగా ఆటో కొనుక్కొని భార్యను, ఇద్దరు కుమార్తెలను పోషించుకోవాలనుకున్నాడు. ఇందుకోసం ఏడాది క్రితం ఫైనాన్స్‌లో కొత్త ఆటోను కొనుగోలు చేశాడు. సరిగ్గా అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరిట ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. దీంతో కోటి ఆశలతో కొత్త ఆటో కొనుగోలు చేసిన సుమంత్‌కు కష్టాలు మొదలయ్యాయి. ఎలాగైనా రేయింబవళ్లూ ఆటో తోలి కుటుంబాన్ని పోషించుకోవాలనుకున్నాడు. కానీ మహిళలు పెద్దగా ఆటో ఎక్కపోవడంతో అతడికి రోజువారీ ఖర్చుల కోసం కూడా కిరాయిలు లభించేవి కావు. ఇక నెలవారీ కిస్తీల కోసం పడరాని పాట్లు పడేవాడు. ఒకవేళ సమయానికి కిస్తీలు చెల్లించకపోతే ఫైనాన్స్ సంస్థ బాధ్యులు తన ఆటోను తీసుకెళ్తారేమోనని ఆందోళనపడేవాడు. చివరికి అప్పులు చేసి మరీ కిస్తీలు చెల్లిస్తుండేవాడు.
ఆటో నడవని కారణంగా కుటుంబ పోషణ కోసం కూడా మరికొంత అప్పు చేశాడు. ఈ రెండు అప్పులూ కలిపి రూ.6 లక్షలయ్యాయి. దీంతో ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూశాడు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందేమోనని ఆశగా చూశాడు. ఏడాది దాటినా ఆ హామీ కూడా అమలు కాలేదు. అతడికి రూ.12 వేలు కూడా రాలేదు. ఇక ఈ అప్పులు తీర్చే మార్గం కన్పించడంలేదంటూ కొంతకాలంగా తోటి ఆటో డ్రైవర్లతో తన ఆవేదనను పంచుకునేవాడు. ఈ క్రమంలో ఆ అప్పుల బాధను తాళలేక ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో సుమంత్ తన ఇంట్లోనే ఉరేసుకొని ఉసురు తీసుకున్నాడు. మృతుడికి భార్య నాగమణి, ఇద్దరు కూతుర్లు చాందిని (7వ తరగతి), చిన్ని (5వ తరగతి) ఉన్నారు.
ఆటో డ్రైవర్‌కు పలువురి నివాళి
అప్పులబాధతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్ రెడ్డబోయిన సుమంత్ మృతదేహం వద్దకు తోటి ఆటోడ్రైవర్లు ఆదివారం పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పలువురు ప్రముఖులు కూడా వచ్చి అతడి మృతదేహానికి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, బీఆర్ఎస్ నాయకులు దిండిగాల రాజేందర్, దొండ డానియేల్, బావుసింగ్‌నాయక్, కటకం పద్మావతి, నాయకులు దాస్యం ప్రమోద్‌కుమార్, అబ్దుల్ నబీ, సత్తాల హరికృష్ణ, హరిప్రసాద్, సురేశ్, రాజపల్లి శ్రీను, డేరంగుల పోశం తదితరులు ఉన్నారు. కాగా, కనకయ్య, హరిప్రియలు మృతుడికి కుటుంబానికి చెరో రూ.5 వేల చొప్పున ఆర్థికసాయం అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల ఉసురు తీస్తోందని, సుమంత్‌ది కూడా ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అవుతుందని విమర్శించారు. సుమంత్ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు.