సత్తుపల్లిటౌన్, అక్టోబర్ 22 : నేటి యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటుపడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని, పిల్లల నడవడికను, అలవాట్లను నిత్యం గమనిస్తూ ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ తల్లిదండ్రులకు సూచించారు. మత్తు పదార్థాలకు అలవాటుపడిన వారితోపాటు వాటి వల్ల కలిగే దుష్ప్రయోజనాలపై సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ గత నెలలో గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన కేసులో నిందితులను విచారించగా.. సత్తుపల్లి ప్రాంతాల్లో కొందరికి గంజాయి అందజేసినట్లు తమ విచారణలో తేలిందన్నారు. దీంతో వారందరినీ గుర్తించి వారితోపాటు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్, అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మత్తు పదార్థాలు, గంజాయి శరీరానికి హాని చేయడంతోపాటు జీవితాలను అంధకారంలోకి నెట్టి వేస్తాయని పేర్కొన్నారు. ఈ క్షణం చేసే తప్పుతో జీవితాంతం పోలీస్‌స్టేషన్, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. గంజాయికి అలవాటుపడి మానుకోలేని పరిస్థితి ఉన్న వారికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన డీ-అడిక్షన్ సెంటర్లో ఉచితంగా కౌన్సిలింగ్ అందిస్తారని తెలిపారు. గంజాయి అక్రమ రవాణా చేయడంతోపాటు మత్తు పదార్థాలు వినియోగాన్ని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం సత్తుపల్లి ఠాణాను సందర్శించిన సీపీ పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. అక్రమ రవాణా, దొంగతనాల కట్టడికి రాష్ట్ర సరిహద్దు వద్ద వాహనాల తనిఖీలు విస్తృతంగా చేపట్టాలన్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో కల్లూరు ఏసీపీ రఘు, సీఐ కిరణ్ పాల్గొన్నారు.