– ఏఎంసీ చైర్మన్ బండారు నరసింహారావు
ఎర్రుపాలెం, జూలై 18 : విద్యార్థులకు నాణ్యమైన, ఆధునిక విద్యను అందించాలనే లక్ష్యంతో ఆక్సల్ ప్రోగ్రాం ద్వారా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలకు అందించిన కంప్యూటర్లను మధిర ఏఎంసీ చైర్మన్ బండారు నరసింహారావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అత్యధిక విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో బనిగండ్లపాడు బీసీ కాలనీ పాఠశాల ఒకటిగా నిలవడం గర్వకారణమన్నారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తూ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంలో ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయ బృందం చూపుతున్న చొరవ ప్రశంసనీయమని కొనియాడారు.
నేటి పోటీ ప్రపంచంలో కంప్యూటర్ పరిజ్ఞానం ప్రతి విద్యార్థికి అత్యంత అవసరమని పేర్కొంటూ, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాలకు అందించిన కంప్యూటర్ల ద్వారా విద్యార్థుల్లో డిజిటల్ విద్యపై ఆసక్తి పెరిగి, భవిష్యత్లో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు మరింత విస్తరిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొగ్గుల శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ నాగరాజు, అక్కిరెడ్డి, పిచ్చిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వెంకటరామిరెడ్డి, ప్రధానోపాధ్యాయులు జంగా గురునాథరెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.