కారేపల్లి, సెప్టెంబర్ 04 : ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని రేలకాయలపల్లి గిరిజన సమీకృత బాలుర వసతి గృహాన్ని స్థానిక ఎంపీడీఓ శ్రీనివాసరావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా హాస్టల్ లోని నిత్యవసర వస్తువుల సరుకుల నిల్వ గదిని పరిశీలించారు. సరుకులను అభద్రతగా నిల్వ చేయడంపై హెచ్ఎం డి.భిక్షం(ఇన్చార్జి వార్డెన్)ను మందలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం, కూరలు రుచికరంగా లేవన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించాలని సూచించారు.
పాఠశాలలో 149 మంది విద్యార్థులు ఉండాల్సి ఉండగా 89 మంది మాత్రమే హాజరయ్యారు. పాఠశాల, వసతి గృహం భవనంలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడం, ఫ్యాన్లు నిరుపయోగంలో ఉండడాన్ని గమనించి కారణం అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం విద్యార్థులకు అన్ని రకాల వసతులు, సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు. ఎంపీడీఓ వెంట స్థానిక పంచాయతీ కార్యదర్శి రమేశ్, ఎన్ఆర్ఈజీఎస్ టీఏ నాగేంద్రబాబు ఉన్నారు.
Karepally : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి : ఎంపీడీఓ శ్రీనివాసరావు