మధిర, మార్చి 26 : విద్యార్థులకు పోషక ఆహారంతో కూడిన నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఖమ్మం జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి, మధిర మండల ప్రత్యేక అధికారి ఏ.శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఎంపీడీఓ వెంకటేశ్వర్లుతో కలిసి మధిర మండల పరిధిలోని రాయపట్నం పాఠశాలను బుధవారం ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనంలో కూర, అన్నం, బియ్యం, వంట పాత్రల గదులను పరిశీలించారు. విద్యార్థులు ప్లేట్లను ఏ వాటర్ తో కడుగుతున్నారు, డ్రింకింగ్ వాటర్ ఏవి తాగుతున్నారు, అన్నం తినేముందు చేతులు, ప్లేట్లు కడుగుతున్నారో లేదో పరిశీలించారు.
టాయిలెట్స్ ను ప్రతిరోజు శుభ్రం చేస్తున్నారా లేదా అని హెచ్ఎం డేవిడ్ రాజుని అడిగి తెలుసుకున్నారు. కూరలో వాడే పదార్థాల వివరాలను మధ్యాహ్న భోజనం తయారు చేసే వర్కర్ రమాదేవిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే మెనూపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం చెప్పిన విధంగా రోజూ మెనూ ప్రకారమే విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారాన్ని అందించాలన్నారు. పాఠశాల పరిశుభ్రంగా ఉండాలని, టాయిలెట్స్ ను ప్రతిరోజు బ్లీచింగ్, ఫినాయిల్, వాటర్ తో శుభ్రం చేయాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అజయ్ కుమార్, విజయ, జనార్దన్ రెడ్డి, విశ్వనాథం పాల్గొన్నారు.