రఘునాథపాలెం, నవంబర్ 30: ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు, విద్యార్థుల మరణాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బాధ్యత వహించాలని వామపక్ష విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ డిమాండ్ చేశాయి. అధికారం చేపట్టి ఏడాది కావొస్తున్నా ఇంకెంతకాలం ఈ పురుగుల అన్నం, నీళ్ల చారు పెడతారని ప్రశ్నించాయి.
ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లో నాణ్యమైన ఆహారం అందక విద్యార్థులు అనారోగ్యాల భారిన, మరణాల భారిన పడుతుండడాన్ని ప్రశ్నిస్తూ ఆయా విద్యార్థి సంఘాల నేతలు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలను బంద్ చేయించారు.
ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలు ఇటికాల రామకృష్ణ, తుడుం ప్రవీణ్, వెంకటేశ్, మస్తాన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని డిమాండ్ చేశారు. గురుకులాల్లోని భోజనంలో నాణ్యత లేకపోవడం వల్లనే విద్యార్థులు ఫుడ్ పాయిజన్ భారిన పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి వరుస ఘటనలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సంఘాల నేతలు పాల్గొన్నారు.