కూసుమంచి(నేలకొండపల్లి), మార్చి 6 : ఇంటర్ పరీక్షలు రాసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న ముగ్గురు విద్యార్థులు ఎదురుగా వస్తున్న కారును ఢీకొని, ఆపై పరీక్షలు రాసి ఎదురుగా వస్తున్న మరో ముగ్గురు ఇంటర్ విద్యార్థుల బైక్‌ను బలంగా ఢీకొట్టారు. దీంతో ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నేలకొండపల్లి మండల కేంద్రం సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని సదాశివపురం గ్రామానికి చెందిన ఎండ్రాతి విశాల్, జల్లిపల్లి జశ్వంత్, పొట్ట ఆకాశ్.. వీరు ముగ్గురు సింగారెడ్డిపాలెం వద్ద ఉన్న గురుకుల పాఠశాలలో ఇంటర్ పరీక్షలు రాసి ద్విచక్ర వాహనంపై నేలకొండపల్లి వైపు వెళ్తున్నారు.
ఈ క్రమంలో నేలకొండపల్లిలోని గౌతమి కళాశాలలో ఇంటర్ పరీక్షలు రాసి కొరట్లగూడెంకు చెందిన బచ్చలకూర అభినవ్, అమ్మగూడెంకు చెందిన వాసంశెట్టి ఉదయ్, ఆరెగూడెంకు చెందిన బోయిన ఉదయ్‌లు ద్విచక్ర వాహనంపై సింగారెడ్డిపాలెం వైపు వెళ్తున్నారు. దీంతో ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయినా కంట్రోల్ కాకపోవడంతో కారును ఢీకొని, ఆ తర్వాత ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని మరో ద్విచక్ర వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలపై ప్రయాణిస్తున్న ఆరుగురు విద్యార్థులు చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోయి ఆర్తనాదాలు చేశారు.
రోడ్డుపై అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి 108 వాహనం సహాయంతో నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉండటంతో వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వీరంతా రోజువారీ కూలీల పిల్లలు కావడంతో ప్రమాద విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు విలపిస్తూ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఎస్సై సంతోశ్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో ఎర్రయ్య గాయపడిన విద్యార్థులను నేలకొండపల్లి ఆసుపత్రిలో పరామర్శించారు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.