ఖమ్మం ఎడ్యుకేషన్, నవంబర్ 28: ప్రభుత్వ విద్యాసంస్థల్లో అధ్వానంగా ఉన్న మధ్యాహ్న భోజనం అమలు తీరు, విద్యార్థిని శైలజ మరణం, మాగనూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు ఖాళీ ప్లేట్లతో ఖమ్మం నగరంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ మాట్లాడుతూ ఎందరో పేద తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ, గురుకుల పాఠశాలల్లో చేర్పించి చదివిస్తున్నారని, వారికి నాణ్యమైన భోజనం అందించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. భోజనం నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులు అనారోగ్యం పాలవుతూ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. నాణ్యమైన భోజనం అందించి, విద్యార్థులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ర్యాలీలో పీడీఎస్యూ నాయకులు శ్రీకాంత్, శ్రీనివాస్, పృథ్వీ, యశ్వంత్, వెంకటేశ్, ప్రసాద్, కావ్య, అలేఖ్య, అనూష, సింధు, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.