మామిళ్లగూడెం, అక్టోబర్ 13: రాష్ట్ర ప్రభుత్వం ‘బెస్ట్ అవైలబుల్ స్కీం (బీఏఎస్)’కు సంబంధించిన ఫీజుల బకాయిలను ఆయా ప్రైవేట్ పాఠశాలలకు వెంటనే చెల్లించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట తమ తల్లిదండ్రులతో కలిసి ఆందోళన నిర్వహించిన విద్యార్థులు అదనపు కలెక్టర్లకు తమ గోడును విన్నవించుకున్నారు. వివరాల్లోకెళ్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో బీఏఎస్ ద్వారా ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉచితంగా ప్రవేశాలు కల్పించి కార్పొరేట్ విద్యను అందిస్తున్నది.
అయితే గత రెండేళ్లుగా ఆయా పాఠశాలలకు ఈ పథకం కింద చెల్లించాల్సిన ఫీజుల బకాయిలను ప్రభుత్వం విడుదల చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. దీంతో విద్యార్థులను ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు తరగతులకు హాజరు కానివ్వకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఫీజుల బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతున్నారు.