ఖమ్మం, జూలై 16 : విద్యార్థులపై వివక్ష చూపిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదని ఏఐఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు స్పష్టం చేశారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికీ ఇదే గతి పడుతుందని తేల్చిచెప్పారు. రేవంత్ ప్రభుత్వ నిర్ణయాలు రాష్ట్ర విద్యార్థులకు శాపంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న ఫీజులు, ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులు, స్కాలర్షిప్పులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ‘హలో విద్యార్థీ.. చలో కలెక్టరేట్..’ పేరిట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట బుధవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
తొలుత వీవీ పాలెం బస్టాప్ నుంచి కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీగా వచ్చిన విద్యార్థులు కలెక్టరేట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కలెక్టరేట్ గేటు ఎదుట వీరిని పోలీసులు తాళ్లతోనూ, బారికేడ్లతోనూ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో విద్యార్థులంతా అక్కడే కూర్చొని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇటికాల రామకృష్ణ మాట్లాడుతూ.. విద్యార్థుల బోధనా రుసుములు, ఉపకార వేతనాలను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా నాన్ ప్రొఫెషనల్ కోర్సుల ఫీజు రీయింబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు రూ.2 వేల కోట్లు, ప్రొఫెషనల్ కోర్సులకు రూ.4 వేల కోట్లు పెండింగ్ ఉన్నాయని గుర్తుచేశారు. బకాయిల కారణంగా ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు పలుమార్లు నిరవధిక బంద్ నిర్వహించినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని విమర్శించారు. ఫీజులు విడుదల చేయకపోవడంతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ ఫీజులు విడుదల చేయని పక్షంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆ సంఘం నాయకులు పాల్గొన్నారు.