రఘునాథపాలెం, నవంబర్ 9: రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన రూ.8,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలనే డిమాండ్‌తో ఖమ్మం నగర యువకుడు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రాకేశ్దత్తా పోరుబాట పట్టాడు. ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు తమ కళాశాలల్లో తరగతులను నిలిపివేస్తుండడం, విద్యార్థులు తమ విలువైన విద్యను కోల్పోతుండడం వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సర్కారుకు కనువిప్పు కలిగేలా పోరాడనున్నాడు.
ఇందుకోసం 17న ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు 200 కిలోమీటర్ల మేర పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నాడు. కాగా, ఈ పాదయాత్ర పోస్టర్‌ను మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఐఏఎస్ చిరంజీవులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆదివారం ఆవిష్కరించారు. యువత తలుచుకుంటే ప్రభుత్వాలు దిగిరాక తప్పదని వారు స్పష్టం చేశారు. మాజీ డీజీపీ డాక్టర్ పూర్ణచందర్రావు, ఓబీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.