కారేపల్లి, డిసెంబర్ 08 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి (శాంతినగర్) ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత ఆశ్రమ పాఠశాల నుండి ఆదివారం సాయంత్రం ఓ విద్యార్థి ఉపాధ్యాయుల అనుమతి లేకుండా బయటికి వెళ్లాడు. ద్విచక్ర వాహనదారుడిని లిఫ్ట్ అడిగి వెళ్తుండగా ఆ మోటార్ సైకిల్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో విద్యార్థి తలకు బలమైన గాయాలు తగిలాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం దోనబండకు చెందిన బానోత్ సాగర్ ఉసిరికాయలపల్లి ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో ఉంటూ 9వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవుదినం కావడంతో ప్రధానోపాధ్యాయుడు, హాస్టల్ వార్డెన్ పాఠశాలలో అందుబాటులో లేరు. దీంతో ఆ విద్యార్థి ఎటువంటి అనుమతి లేకుండా సమీపంలోని ఇల్లెందుకు వెళ్లాడు.
తిరుగు ప్రయాణంలో ఇల్లెందు కరెంట్ ఆఫీస్ నుండి పాఠశాల వైపు వచ్చేందుకు ఓ బైకర్ని లిఫ్ట్ అడిగాడు. వారు ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ ఎదురుగా వస్తున్న మరో బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న విద్యార్థి తలకు గాయాలయ్యాయి. దీంతో ఆ వాహనదారులు విద్యార్థిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. గాయపడిన విద్యార్థి ప్రమాదం జరిగిన విషయాన్ని తన తండ్రికి ఫోన్ ద్వారా తెలుపడంతో విద్యార్థి తండ్రి పాఠశాల వార్డెన్ కు ఫోన్ చేయగా ఉపాధ్యాయులు వెంటనే అక్కడకు చేరుకుని అతడిని చికిత్స కోసం ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం వైద్యులు కొత్తగూడెం రిఫర్ చేశారు. కొత్తగూడెంలో చికిత్స పొందుతున్న విద్యార్థిని సోమవారం హాస్టల్ వార్డెన్ ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నాడు.
ఈ విషయమై హాస్టల్ వార్డెన్ బాల్ సింగ్ను నమస్తే తెలంగాణ వివరణ అడగగా తనకు ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల ఆదివారం మధ్యాహ్నం హాస్టల్ నుండి ఇంటికి వెళ్లినట్లు చెప్పాడు. దీంతో 9వ తరగతి చదువుతున్న సాగర్ అనే విద్యార్థి పాఠశాలలో ఎవరికి చెప్పకుండా ఇల్లెందు వెళ్లినట్లు వెల్లడించాడు. తిరుగు ప్రయాణంలో ఓ మోటార్ సైకిల్ పై వస్తుండగా ప్రమాదం బారిన పడ్డట్లు తెలిపాడు. ప్రస్తుతం ఆ విద్యార్థికి దగ్గరుండి ఖమ్మం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఖర్చులన్నీ తానే భరిస్తూ చికిత్స చేయిస్తున్నట్లు, విద్యార్థి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వెల్లడించారు.