ఖమ్మం కమాన్‌బజార్, జూన్ 21 : ఆర్టీసీ పరిరక్షణ, కార్మిక చట్టాల రక్షణ కోసం కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని అఖిల భారత రోడ్డు రవాణా కార్మికుల సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మయ్య పిలుపునిచ్చారు. ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(ఎస్‌డబ్ల్యూఎఫ్) రాష్ట్ర 4వ మహాసభలు శనివారం ఖమ్మంలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్లో ప్రారంభమయ్యాయి. తొలుత నాయకులు నేపాల్‌దేవ్ భట్టాచార్య, యర్ర శ్రీకాంత్‌ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం జరిగిన మహాసభలో ఆయన మాట్లాడుతూ 2019 మోటార్ వాహన చట్టం సవరణలతో కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఆర్టీసీ సంస్థలకు సమాధి కట్టే సవరణలు చేసిందని ఆరోపించారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ప్రైవేట్ ఆపరేటర్లు, అగ్రిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ పాలసీ పేరుతో ప్రైవేట్ ఆపరేటర్లు, అగ్రిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ పాలసీ పేరుతో ఊబర్, ఓలా వంటి సంస్థలతోపాటు బహుళజాతి రవాణా సంస్థలు కూడా భారత రవాణా రంగంలో చొరబడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో నల్లచట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటం విజయం సాధించినట్లుగా, భారత కార్మిక వర్గం కూడా తమకు నష్టం చేసే లేబర్ కోడ్లను రద్దు చేసే వరకూ కార్మిక, కర్షక మైత్రితో సమరశీల పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. జూలై 9న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీలోని అన్ని కార్మిక వర్గాలు పాల్గొనాలని ఆయన కోరారు. మహాసభలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు, కార్యదర్శి గడ్డం లింగమూర్తి, వివిధ సంఘాల నాయకులు అశ్వత్థామరెడ్డి, పాటి అప్పారావు, హనుమతరావు, వీఎస్ రావు, కళ్యాణం వెంకటేశ్వరరావు, వై.విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.