– అవస్థలు పడుతున్న ఇందిరమ్మ కాలనీలవాసులు
– ఇంటి నంబర్ రాకపోవడంతో కరెంట్ సౌకర్యం కరువు
ఖమ్మం రూరల్, ఏప్రిల్ 17 : మాకు ఇంటి నంబర్ ఇప్పించండి ఏటా ఇంటి పన్ను కడుతాం బాబు అని మొరపెట్టుకున్నా సదరు నిరుపేదల ఇబ్బందులను పట్టించుకునే నాథుడు ఏదులాపురం మున్సిపాలిటీలో కరువయ్యాడు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వెంకటగిరి పెద్దతండ పంచాయతీ పరిధిలో దాదాపు 20 ఏళ్ల క్రితం నాటి సర్కార్ వేలాది మంది నిరుపేదలకు ఇండ్ల స్థలాలను ఇవ్వడం జరిగింది. ఇళ్ల స్థలాలు పొందిన సదరు కుటుంబాలు కాలక్రమేనా వారి ఆర్థిక స్తోమతకు అనుకూలంగా ఇంటి నిర్మాణాలు చేసుకుని జీవనాధారం వెల్లదీస్తున్నారు. మున్సిపాలిటీ ఏర్పాటు కాకముందు నాటి పంచాయతీ కార్యదర్శులు ఇందిరమ్మ ఇళ్ల స్థలం పట్టా పొందిన వ్యక్తుల పేరు మీద ఇంటి నిర్మాణం తీసుకుంటే ఇంటి నంబర్లు ఇవ్వడం జరిగింది.
దీంతో సదరు కుటుంబాలు నాటి నుండి నేటి వరకు ఇంటి పన్ను కడుతూ వస్తున్నారు. అయితే ఏదులాపురం మున్సిపాలిటీ ఏర్పాటు జరిగిన తర్వాత ఇందిరమ్మ కాలనీ వాసులకు ఇంటి నంబరు ఇవ్వాలంటే వెనుకంజ వేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో సదరు బాధితులు అనేకమార్లు ప్రభుత్వ పెద్దల దృష్టికి తమ ఇబ్బందులను తీసుకు వెళ్లడంతో కొద్ది కాలం పాటు మున్సిపల్ అధికారులు 72 గజాల స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకున్న వ్యక్తుల దగ్గర సుమారు రూ.30 నుండి 40 వేలు ఇంటి పన్ను రూపంలో వసూలు చేసి ఇంటి నంబర్లు ఇవ్వడం జరిగింది. అయితే కొద్ది రోజులకు ఈ విధానానికి కూడా స్వస్తి చెప్పడంతో నూతనంగా ఇంటి నిర్మాణం చేసుకున్న కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.
ఇంటి నంబర్ వస్తేనే కరెంట్ మీటర్ ఇస్తామని విద్యుత్ శాఖ అధికారులు తేల్చి చెబుతూ ఉండటంతో ఇటు ఇంటి నంబరు రాక కట్టుకున్న ఇంటికి కరెంట్ లేక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇందిరమ్మ కాలనీలో నెలకొంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు అర్జీలు పెట్టుకున్న వ్యక్తుల వివరాలను ఇంటి నిర్మాణాన్ని పరిశీలించి ఇంటి నంబర్ ఇవ్వాలని స్థానికుల నుండి డిమాండ్ వ్యక్తం అవుతుంది. మరి ఆ దిశగా మున్సిపల్ అధికారులు పరిస్థితిని అర్థం చేసుకుని సమస్యను పరిష్కరిస్తారా లేక సాగదీస్తారా వేచి చూడాలి.