– నామినేషన్ల స్వీకరణకు 13 కేంద్రాలు
– ఏదులాపురం మున్సిపాలిటీ కమిషనర్ అలీ
ఖమ్మం రూరల్, జనవరి 24 : మరికొద్ది రోజుల్లో జరిగే ఏదులాపురం మున్సిపాలిటీకి సంబంధించిన వార్డు కౌన్సిలర్ల ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు చేపట్టడం జరుగుతుందని మున్సిపాలిటీ కమిషనర్ మున్వర్ అలీ తెలిపారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల్లో ఏర్పాటు చేయబోయే పోలింగ్ కేంద్రాలు, నామినేషన్ల స్వీకరణ సెంటర్లను ఆయన పరిశీలించారు. నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ బూత్లల్లో మౌలిక వసతులు, ఇతర సామగ్రి తదితర విషయాలపై సంబంధిత మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఫొటోతో కూడిన ఓటరు జాబితాను విడుదల చేయడం జరిగిందన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 32 వార్డులకు గాను 69 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
ఒక్కో పోలింగ్ కేంద్రంలో సగటున 650 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా నామినేషన్ల స్వీకరణకు గాను మున్సిపాలిటీలో 13 కేంద్రాలను గుర్తించడం జరిగిందని, ఒక్కో నామినేషన్ స్వీకరణ కేంద్రంలో రెండు నుంచి నాలుగు వరకు వార్డులకు పోటీ చేయబోయే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు. పోలింగ్ సామగ్రి పంపిణీ, ఆయా అవార్డులకు సంబంధించి ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రియదర్శి మహిళా ఇంజినీరింగ్ కళాశాలను పరిశీలించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు శ్రీధర్ రెడ్డి, మధు, కిరణ్ పాల్గొన్నారు.