కొత్త రేషన్‌కార్డుల ముచ్చట ఇప్పట్లో ముగిసేటట్లు కనిపించడం లేదు. కొండంత రాగం తీసి.. అదేదో పాట పాడినట్లుగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం. అధికారంలోకి రాగానే అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రగల్భాలు పలికి.. ఇప్పుడేమో చతికిలపడింది. దరఖాస్తు చేసుకున్న వేలాదిమంది నిరుపేదలు కొత్తకార్డుల కోసం వేయికండ్లతో ఎదురుచూస్తున్నారు. ఇన్నాళ్లు విసిగించిన ప్రభుత్వం తీరా కొద్దిమందికే కొత్త కార్డులు జారీ చేస్తున్నారు. వాటిలోనూ గజిబిజి.. గందరగోళం నెలకొంది. సపరేటుగా కొత్తకార్డులు ఇవ్వకుండా పాతకార్డుల్లోనే కొత్త పేర్లు యాడింగ్ చేస్తున్నారు. ఇదేమిటని అధికారులను అడిగితే పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. దీంతో అసలు దరఖాస్తు చేసుకున్నవారందరికీ కొత్త రేషన్ కార్డులు వస్తాయో.. లేదోనన్న అనుమానం కలుగుతున్నది. రేషన్‌కార్డు లేకపోవడంతో సన్నబియ్యానికి నోచుకోకపోవడంతోపాటు ప్రభుత్వ పథకాలకూ అర్హత కోల్పోతుండడంతో నిరుపేదలు లబోదిబోమంటున్నారు.
– ఖమ్మం, మే 14
“ఖమ్మం రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెం గ్రామానికి చెందిన గడ్డం బతుకమ్మకు దాదాపు 70 ఏండ్లు. కూతురు, కుమారులకు ఎప్పుడో వివాహాలయ్యాయి. ఆమెకు అంత్యోదయ రేషన్‌కార్డు ఉంది. రెండేళ్ల క్రితం పక్షవాతం రావడంతో మంచానికే పరిమితమైంది బతుకమ్మ. ప్రతి నెలా ఓటీపీ విధానం ద్వారా ఆమె కార్డుపైన 35 కిలోల బియ్యాన్ని కుటుంబ సభ్యులు తీసుకెళ్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్తకార్డులకు అవకాశం కల్పించడంతో ఆమె మనువడు తన భార్య, ఇద్దరు పిల్లలతో దరఖాస్తు చేసుకున్నాడు.
ఐతే వారం క్రితం బియ్యం తీసుకునేందుకు రేషన్‌షాపులో ప్రయత్నించగా బతుకమ్మ కార్డుపై ఓటీపీ రావడం లేదు. ఆన్లైన్లో పరిశీలించగా ఆమె కార్డులోకి తన మనువడు అతని కుటుంబసభ్యులు వచ్చి చేరడంతో ఐదుగురు సభ్యులు కనిపిస్తున్నారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉంటే ఓటీపీ ద్వారా బియ్యం తీసుకోవడం కుదరదు. ఇదేమిటని ఆమె అల్లుడు అధికారులను కలువగా ప్రభుత్వం పెట్టిన యాప్ ద్వారా ఒకే ఇంటి నెంబర్ ఉన్న వారందరూ ఒకే కార్డులోకి వస్తారని సమాధానం చెప్పడం గమనార్హం.
అమ్మమ్మ, నాయనమ్మ కార్డుల్లోకి మనువళ్లు, మనువరాళ్లు రాష్ట్రవ్యాప్తంగా కొత్త కార్డుల జారీలో వింత పరిస్థితి నెలకొంది. ఖమ్మం జిల్లాలో కొత్తకార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వేలాది మంది ఆశగా ఎదురుచూస్తున్నారు. వివాహాలు జరిగి సంవత్సరాలు అవుతున్నా కొత్త రేషన్ కార్డులు లేక ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
కొత్త కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే అప్పటికే ఉన్న కార్డులో నుంచి పేరు తొలగించుకోవాలనే నిబంధన ఉంది. ఆధార్ కార్డు ఒక్కటే ఉంటుంది కనుక ప్రస్తుతం ఉన్న కార్డులో పేరు ఉంటే కొత్త కార్డుకు మీ సేవలో దరఖాస్తు చేసుకునే వీలు ఉండని కారణంగా వేల సంఖ్యలో ప్రజలు తమ పేర్లును తొలగించుకున్నారు.
భార్య, భర్త ఇద్దరు కూడా వారి వారి తల్లిదండ్రుల కార్డుల్లో ఉన్న పేర్లను తొలగించుకుని పిల్లలతో సహా కొత్త కార్డులకు దరఖాస్తు చేయగా అమ్మమ్మ, నాయనమ్మ కార్డులలోకి మనువళ్లు, మనువరాళ్ల పేర్లు ఎక్కాయి. పాత కార్డుల్లోనే వారి పేర్లు జమ అయ్యాయి.. తప్ప కొత్తగా వారి కుటుంబానికి సపరేటుగా రేషన్‌కార్డు రాలేదు. అల్లుడు పేరు అత్తగారి ఊర్లో, కూతురు పేరు తల్లిగారి ఊర్లో రావడంతో కొత్తకార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
పథకాల వర్తింపునకు అడ్డంకే..
ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటే పేద ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. కార్డులోని ఏ ఒక్కరైనా గతంలో పథకం పొంది ఉంటే ఆ కార్డులోని మిగిలిన సభ్యులకు వర్తించే అవకాశం ఉండదు. ఉదాహరణకు గతంలో అత్త పేరుపైన ప్రభుత్వం నుంచి ఇల్లు వచ్చి ఉంటే ఇప్పుడు కోడలుకు ఇందిరమ్మ ఇల్లు వచ్చే అవకాశం లేదు. ఇలా రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకునే ఏ పథకం అయినా ఇబ్బందులు తప్పవని పేదలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు, ప్రభుత్వం స్పందించి వేరువేరుగా రేషన్ కార్డులు ఇవ్వాలని కోరుకుంటున్నారు.
కొత్త కార్డులు వచ్చాయా? రాలేదా?
జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవా, ప్రజాపాలన ద్వారా 72,131 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో దాదాపు 20 వేల మందికి పైగా రెండుచోట్ల దరఖాస్తు చేసుకున్నారు. చాలా మంది పేర్లు గతంలో వారు ఏ కార్డులో ఐతే ఉన్నారో తిరిగి వారి పేర్లు పిల్లల పేర్లుతో సహా పాత కార్డులోనే జమ అయ్యాయి. ఐతే అలా రానివారూ కూడా జిల్లాలో వేల సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. ఐతే వారికి కొత్త కార్డు వచ్చిందా? రాలేదా? అనే విషయం తెలియక రేషన్ డీలర్ల వద్దకు తిరుగుతున్నారు. రేషన్‌షాపులో కార్డు నెంబర్ ఉంటేనే ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక మీ సేవా కేంద్రాలకు వెళ్లి తెలుసుకుంటున్నారు. చాలామందికి కొత్త కార్డులు రాకపోవడంతో బాధపడుతూ వచ్చేనెలలో అయినా వస్తుందోనని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
జిల్లాలో 72,131 దరఖాస్తులు..
ఖమ్మం జిల్లాలో మీ సేవా కేంద్రాలు, ప్రజాపాలన గ్రామసభల్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 72,131. వీరుకాకుండా ఇప్పటికే కార్డు ఉండి పిల్లల పేర్లు ఎక్కకుండా ఉన్నవారు కూడా వేల సంఖ్యలోనే ఉన్నారు. వీరి సంఖ్య కచ్చితంగా ఎంత అనేది అధికారుల వద్ద సమాచారం లేదు. కొత్త కార్డుల దరఖాస్తుల సంఖ్య ఉంది కానీ పిల్లల పేర్లు ఎన్ని అనేవి మాత్రం లేదు. అవన్నీ ఆన్లైన్లో చేసుకోవడంతో జిల్లా అధికారుల వద్ద నిర్దిష్టమైన సమాచారం లేదు.
మీ సేవా కేంద్రాల ద్వారా ఖమ్మం అర్బన్ 1,505, నేలకొండపల్లి 478, చింతకాని 467, ఖమ్మం రూరల్ 418, కొణిజర్ల 378, ముదిగొండ 376, కల్లూరు 365, బోనకల్ 325, తల్లాడ 275, సింగరేణి 272, మధిర 263, రఘునాథపాలెం 245, వైరా 233, కామేపల్లి 210, సత్తుపల్లి 185, కూసుమంచి 174, వేంసూరు 154, పెనుబల్లి 150, తిరుమలాయపాలెం 110, ఏన్కూరు 76, ఎర్రుపాలెం 56 దరఖాస్తులు మొత్తం జిల్లాలో 6,717 దరఖాస్తులు మీ సేవా కేంద్రాల ద్వారా కొత్త కార్డులకు దరఖాస్తులు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టిన ఆరు పథకాలకు సంబంధించి స్వీకరించిన వాటిలో రేషన్‌కార్డుల కోసం ప్రజాపాలన గ్రామసభల్లో 66,115 దరఖాస్తులు వచ్చాయి.