‘గిరిజనుల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఏళ్ల తరబడి కునారిల్లుతున్న మారుమూల గిరిజన తండాలకు ఒకరూపు తీసుకొచ్చేందుకు పంచాయతీలుగా మార్చింది. గిరిజనులు రాజకీయంగా ఎదుగుతూ.. ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేందుకు అవకాశం కల్పించింది’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శనివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గిరిజన దినోత్సవాన్ని సంబురంగా జరుపుకున్నారు. ఖమ్మంలోని లకారం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు జాటోత్ ఠానునాయక్ విగ్రహాన్ని మంత్రి పువ్వాడ ఆవిష్కరించారు.
ఖమ్మం, జూన్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో గిరిజనాభివృద్ధికి పెద్దపీట వేసినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చడంతో గిరిజనులు సర్పంచ్‌లుగా, వార్డు సభ్యులుగా ఎన్నికయ్యే అవకాశం కలిగిందని అన్నారు. ఈ హోదాలతో వారికి సరైన గౌరవం దక్కినట్లయిందని అన్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గిరిజన దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధిలు ఆయా తండాల్లో పర్యటించారు.
గిరిజనులతో కలిసి ఆట – పాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖమ్మంలోని లకారం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు జాటోత్ ఠాను నాయక్ విగ్రహాన్ని మంత్రి పువ్వాడ అవిష్కరించారు. అనంతరం రఘునాథపాలెం మండలంలోని లచ్చిరాంతండా, దోనబండ, మంగ్యాతంగడా, కేవీ బంజర, మూలగూడెం, ఎన్వీ బంజర, రజబ్ అలీ నగర్ గ్రామాల్లో రూ.1.40 కోట్ల నిధులతో చేపట్టిన నూతన పంచాయతీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం గిరివికాస్ పథకం ద్వారా మంజూరైన మోటార్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం బంజారాలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తోందని అన్నారు. ఖమ్మం రూరల్, నేలకొండపల్లి మండలాల్లోని పలు తండాల్లో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు.
ఈ సందర్భంగా పలు నూతన పంచాయతీ భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్రం వచ్చాకే గిరిజనులు తమ తండాల్లో తాము పరిపాలన చేసుకునే అవకాశం కలిగిందని అన్నారు. విద్య, వైద్యం సహా అనేక రంగాల్లో గిరిజన విద్యార్థులు రాణించేందుకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని అన్నారు. కల్లూరు మండలంలోని ఓబులరావు బంజర గ్రామంలో గిరిజన దినోత్సవానికి సత్తుపల్లి ఎమ్మెల్యే స్ంరడ్ర వెంకటవీరయ్య, కారేపల్లిలో జరిగిన గిరిజన దినోత్సవానికి వైరా ఎమ్మెల్యే రాముల్‌నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.